Site icon HashtagU Telugu

KCR Plan : కేసీఆర్ ‘అర్థాంత‌ర’ ఎత్తుగ‌డ ఇదే!

Kcr Delhi

Kcr Delhi

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎత్తుగ‌డ‌లు అనూహ్యంగా ఉంటాయి. ఆయ‌న వేసే రాజ‌కీయ అడుగులు సామాన్యుల‌కు అంతుబ‌ట్ట‌దు. తాజాగా ఆయ‌న ఢిల్లీ నుంచి అర్థాంత‌రంగా టూర్ ముగించుకుని రావ‌డం వెనుక పెద్ద వ్యూహం ఉంద‌ట‌. ప్ర‌ధాన న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్ వ‌స్తున్నార‌ని భ‌య‌ప‌డి భార‌త్ టూర్ పెట్టుకున్నార‌ని కేసీఆర్ పై పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దానికి చెక్ పెట్ట‌డానికి ఆయ‌న అర్థాంత‌రంగా ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చార‌ని టీఆర్ఎస్ శ్రేణుల నుంచి వ‌స్తోన్న స‌మాచారం.

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అపాయిట్మెంట్ కేసీఆర్ కు ల‌భించ‌లేదు. ప‌లుమార్లు ఢిల్లీ వెళ్లిన‌ప్ప‌టికీ మోడీని క‌ల‌వ‌లేక‌పోయారు. అంతేకాదు, గ‌త ఏడాది భార‌త్ బ‌యోటెక్ విజిట్ కి మోడీ వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇటీవ‌ల స‌మ‌తామూర్తి రామానుచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా కూడా ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ ఏర్ప‌డింది. ఉద్దేశ పూర్వ‌కంగా ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం కేసీఆర్ ను ఆయా కార్యక్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని సూచించింద‌ని ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను పీఎంవో ఆఫీస్ ఖండించింది. ఇద్ద‌రి మ‌ధ్యా ప్రొటోకాల్ విష‌యంలో ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం మాత్రం ఆగ‌లేదు. పైగా మోడీ స‌ర్కార్ ను దించేయాల‌ని భార‌త్ టూర్ కేసీఆర్ పెట్టుకోవ‌డం టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య ఉన్న గ్యాప్ ను పెంచింది.

ఈనెల 26న ఐఎస్బీ స్నాత‌కోత్స‌వానికి వ‌స్తోన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో పాటు ప్రొటోకాల్ ప్ర‌కారం కేసీఆర్ కూడా ఉండాలి. కానీ, సీఎం కేసీఆర్ ఈసారి కూడా మోడీ ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉంటార‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ లో ఉంటూనే గైర్హాజ‌రు కావాల‌ని వ్యూహాత్మ‌క స్టెప్ తీసుకున్నార‌ని స‌మాచారం. ఉద్దేశ పూర్వ‌కంగా భార‌త్ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ చేసిన ప్ర‌చారానికి చెక్ పెట్టేందుకు హైద‌రాబాద్ వ‌చ్చిన కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా మోడీ టూర్ కు దూరంగా ఉంటార‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌ధాని మోడీ టూర్ పూర్తయిన త‌రువాత ఈనెల 27న మ‌ళ్లీ భార‌త్ ప‌ర్య‌ట‌న కేసీఆర్ కొన‌సాగించ‌డానికి సిద్ధం అయ్యారు.

ఢిల్లీ కేంద్రంగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్‌, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ను కేసీఆర్ క‌లుసుకున్నారు. పంజాబ్ వెళ్లి అక్క‌డ ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయాన్ని కూడా అందించారు. ఆయా పార్టీ చీఫ్ ల‌తో రాజ‌కీయ‌ప‌ర‌మైన సంప్ర‌దింపులు జ‌రిపారు. కానీ, సానుకూలంగా స్పంద‌న వాళ్ల నుంచి రాలేద‌ని ఢిల్లీ వ‌ర్గాల వినికిడి. అందుకే, కేసీఆర్ అర్థాంత‌రంగా హైద‌రాబాద్ వ‌చ్చేశార‌ని మ‌రో టాక్‌. సీఎం భార‌త్ ప‌ర్య‌ట‌న‌, మంత్రి కేటీఆర్ దావోస్ టూర్ క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి దిశానిర్దేశం చేసే వాళ్ల‌కు లేకుండా పోయార‌నే ఫీలింగ్ వ‌చ్చింది. దాన్ని భ‌ర్తీ చేయ‌డానికి హ‌ఠాత్తుగా కేసీఆర్ హైద‌రాబాద్ వ‌చ్చార‌ని కొంద‌రు భావిస్తున్నారు. అర్థాంత‌రంగా ముగించిన టూర్ గురించి ప‌లు ర‌కాలు చ‌ర్చ జ‌రుగుతోంది. కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ కేసీఆర్ భార‌త రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యారు. ఆయ‌న‌కు కావ‌ల్సింది కూడా అదే.!