తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు, బీసీ వర్గాలపై తనదైన శైలిలో విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగిస్తోంది. ముఖ్యంగా కులగణన నివేదికపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. పార్టీ శ్రేణుల్లో కలకలం రేపిన ఈ అంశం మల్లన్న భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
Narmada Yatra: నర్మదా పరిక్రమ యాత్ర.. ఆత్మను కనుగొనే ఆధ్యాత్మిక ప్రయాణం
కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ తీన్మార్ మల్లన్నపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన పార్టీకి వివరణ ఇచ్చేలా ఆదేశించింది. ఈ నోటీసులపై మల్లన్న ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బీసీలదని, బీసీలను బయటకు పంపే హక్కు ఎవరికీ లేదని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, బీసీలు కాంగ్రెస్‌ను పండబెట్టి తొక్కుతారని హెచ్చరించారు. ఇటీవల బీసీ గర్జన సభల్లో తీన్మార్ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తెలంగాణకు చివరి ఓసీ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని జోస్యం చెప్పారు. అలాగే రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వాసులే కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తిని రేపాయి. పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తీరు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆలోచనలో పడేసింది.
మల్లన్న తన భవిష్యత్తును బీసీ నాయకుడిగా మలచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన సీఎం కావాలనే లక్ష్యంతో బీసీ కార్డు ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గ్రూప్-1 నియామకాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా విమర్శలు పార్టీకి నష్టం కలిగిస్తాయని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో తీన్మార్ మల్లన్న భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.