మునుగోడు ఉపఎన్నికల పోరు హోరాహోరీగా ఉండటంతో పోటీలోని పక్షాల మద్దతును కూడగట్టుకునేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మునుగోడులో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించడంతోనే ఆయనను రాజగోపాల్ రెడ్డి కలుస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి చంద్రబాబును కలిసిన తర్వాత బీజేపీకి మద్దతుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మునుగోడులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. వారం రోజుల కిందట తెలంగాణ టీడీపీ నేతలు .. చంద్రబాబును కలిసి మునుగోడులో పోటీ చేయాలన్న విజ్ఞప్తి చేశారు. పలువురు బీసీ నేతలు రెడీగా ఉన్నారన్నారు. అదే సమయంలో టీఆర్ఎస్‌లో టిక్కెట్ దక్కని బూర నర్సయ్య గౌడ్ కూడా పార్టీ తరపున పోటీకి ఆసక్తి చూపిస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఆయన బీజేపీలోకి చేరడం దాదాపుగా ఖాయమైంది. అయితే చంద్రబాబు మాత్రం ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని.. అసెంబ్లీ ఎన్నకిల్లా బలపడేందుకు ప్రయత్నిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పోటీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బీజేపీకి మద్దతు ప్రకటించాలని భావిస్తున్నారు.