Site icon HashtagU Telugu

TDP Operation: మునుగోడుపై టీడీపీ ఆప‌రేష‌న్‌, అభ్య‌ర్థిగా బూర‌?

Bura

Bura

డాక్ట‌ర్ బూర న‌ర‌స‌య్య గౌడ్ మీద టీడీపీ క‌న్నేసింది. మునుగోడు బ‌రిలోకి ఆయ‌న్ను టీడీపీ అభ్య‌ర్థిగా దింపాల‌ని ప్లాన్ చేస్తోంది. అయితే, ఆయ‌న నుంచి ఎలాంటి పాజిటివ్ సంకేతాలు ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌ని తెలుస్తోంది. ఒక వేళ గౌడ్ పార్టీలోకి వ‌స్తే, కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో పాటు మునుగోడు నుంచి టీడీపీ స‌త్తా చాటాల‌ని తెలంగాణ టీడీపీ విభాగం స‌రికొత్త ఆపరేష‌న్ కు దిగింద‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం మునుగోడు ఉప ఎన్నిక‌ల బ‌రిలో టీఆర్ఎస్ నుంచి పూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీజేపీ అభ్య‌ర్థిగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్ర‌వంతిరెడ్డి ఉన్నారు. వాళ్లు ముగ్గురూ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన లీడ‌ర్లు. కానీ, మునుగోడులో అత్య‌ధికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల ఓటు బ్యాంకు ఉంది. ప్ర‌ధాన పార్టీలు బీసీల‌ను దూరంగా పెట్టారు. పూర్వం నుంచి బీసీల పార్టీగా పేరున్న టీడీపీ ఇప్పుడు మ‌నుగోడు కేంద్రంగా అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని ప్లాన్ చేస్తోంది. ఆ క్ర‌మంలో బూర న‌ర‌స‌య్య గౌడ్ పై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కొన‌సాగుతోంద‌ని టాక్‌.

స్వ‌త‌హాగా డాక్ట‌ర్ బూర న‌ర‌స‌య్య గౌడ్ సామాన్యులకు అందుబాటులో ఉండే వైద్యుడు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క ఉన్నారు. అందుకే, 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థిగా ఆయ‌న్ను భువ‌న‌గిరి నుంచి బ‌రిలోకి దింపింది. ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన గౌడ్ ఉన్న‌తంగా రాజ‌కీయాల‌ను న‌డిపారు. పార్ల‌మెంటేరియ‌న్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. వైద్యునిగా ఎంత పేరు సంపాదించుకున్నారో, రాజ‌కీయ నాయ‌కునిగా కూడా అంతే మంచిపేరును పొందారు. కానీ, 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను టీఆర్ఎస్ పార్టీ బరిలో దింపినా ఓడిపోయారు. ఆనాటి నుంచి గౌడ్ కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డంలేదు. దీంతో ఆయ‌న సంతృప్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నిక‌ల బ‌రిలో బూర న‌ర‌స‌య్య గౌడ్ టీఆర్ఎస్ త‌ర‌పున ఉంటార‌ని బీసీలు భావించారు. ఆయ‌న పేరుతో పాటు బీసీ సామాజిక‌వ‌ర్గం నుంచి క‌ర్నే ప్ర‌భాక‌ర్ పేరు కూడా తెర‌మీద నిలిచింది. కానీ, మాజీ ఎమ్మెల్యే , మునుగోడు టీఆర్ఎస్ ఇంచార్జిగా ఉన్న ప్ర‌భాక‌ర్ రెడ్డికి టిక్కెట్ ల‌భించింది. దీంతో ఆయ‌న మీద అసంతృప్తిగా ఉన్న వాళ్లు బీజేపీలోకి వెళ్లిపోతున్నారు. అంతేకాదు, ప్ర‌భాక‌ర్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తూ టీఆర్ఎస్ అధిష్టానంకు లేఖ కూడా స్థానిక లీడ‌ర్లు రాశారు. పైగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మూడు పార్టీలు రెడ్డి సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌డంపై స్థానికంగా ఉండే బీసీలు గుర్రుగా ఉన్నారు.

టీఆర్ఎస్ ప్ర‌స్తుతం బీఆర్ఎస్ రూపంలోకి మారిన త‌రువాత మునుగోడు ఉప ఎన్నిక‌ల అందొచ్చిన అవ‌కాశంగా టీడీపీ భావిస్తోంది. ఉమ్మ‌డి ఏపీ ఉన్న‌ప్పుడు మునుగోడు ప్రాంతంలో టీడీపీ బ‌లంగా ఉండేది. మాజీ మంత్రి మాధ‌వ‌రెడ్డి, మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు, గుత్తా సుఖేంద్ర‌రెడ్డి ఆ ప్రాంతంలో ఆనాడు టీడీపీని బాగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌గ‌లిగారు. ఆ బ‌లాన్ని గుర్తు చేసుకుంటోన్న టీడీపీ తిరిగి బ‌లం పుంజుకోవాల‌ని వ్యూహాలను ర‌చిస్తోంది. ఒక వేళ న‌ర‌స‌య్య గౌడ్ సానుకూలంగా స్పందిస్తే మాత్రం టీడీపీ స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఎంత వ‌ర‌కు టీడీపీ ప్లాన్ ఫ‌లిస్తుందో చూడాలి.