TTDP : ఖమ్మంపై చంద్రబాబు గురి….భారీ బహిరంగ సభకు ముహుర్తం ఖరారు..!!

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 12:01 PM IST

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడంపై ఆపార్టీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యే టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చంద్రబాబు తెలంగాణలోని టీడీపీ మాజీనేతలంతా మళ్లీ తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఎక్కడి నుంచి పనిచేస్తున్నా ఆత్మగౌరవంతోనే పనిచేస్తుందని సూచించారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు.

కాగా టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాసాని పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ పోటీ చేస్తుందని చెప్పారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో యువతకే అధికప్రాధన్యం ఇస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే తెలంగాణలో అత్యధికంగా సీట్లు ఖమ్మం జిల్లాలోనే రావడంతో …ఇప్పుడు అధినేత ఖమ్మంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పై ద్రుష్టి సారించనున్నట్లు సమాచారం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ 15స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత టీడీపీ నుంచి వీడిన నేతలంతా టీఆర్ఎస్ లోకి వెళ్లారు. దీంతో తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఒకసమయంలో తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగైనట్లుగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది.

అయితే ఈ మధ్య కాలంలో టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా తెలంగాణపై పూర్తిగా ద్రుష్టిసారిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే టీడీపీలో కాసానికి బలమైన బీసీ నాయకుడిగా మంచి పేరుంది. గతంలో కాసాని టీడీపీకి ఎక్కువగా మద్దతు ఇచ్చారు. ఈసారికూడా బీసీలనే టార్గెట్ చేస్తూ కాసానిని టీటీడీపీ అధినేతగా నియమించారు చంద్రబాబు. అయితే కాసాని బాధ్యతలు చేపట్టినప్పటినుంచి తెలంగాణలో టీడీపీ మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు కనిపిస్తోంది. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఖమ్మం నేతలతో కాసాని సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 21న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో చంద్రబాబు కూడా పాల్గొంటారని తెలిపారు.