Amit Shah, Chandrababu: జ‌గ‌న్‌, కేసీఆర్ పీఠాలు క‌దిలే స్కెచ్ !

తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు ప‌లుమార్లు ఫ‌లించింది. ఆ రెండు పార్టీల కెమిస్ట్రీ ఇంచుమించు ఒకేలా ఉంటుంది.

  • Written By:
  • Updated On - July 21, 2022 / 12:51 PM IST

తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు ప‌లుమార్లు ఫ‌లించింది. ఆ రెండు పార్టీల కెమిస్ట్రీ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అందుకే, సుదీర్ఘ కాలం పాటు కేంద్రం, రాష్ట్రాల్లో క‌లిసి ప‌నిచేసిన చ‌రిత్ర ఉంది. ప్ర‌త్యేకించి తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు క‌లిసి 19 స్థానాల‌ను గెలుచుకున్నాయి. ఆ ఎన్నిక‌ల్లో ఏ మాత్రం చంద్ర‌బాబు తెలంగాణ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్ట‌లేదు. ఏపీలో చావోరేవో తేల్చుకునేలా పోటీ ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా టీడీపీ, బీజేపీ కీల‌క రోల్ పోషించేలా ఎమ్మెల్యేలను గెలుచుకుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం మారిన రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా మ‌రోసారి బీజేపీ, టీడీపీ పొత్తుకు మార్గం సుగ‌మ‌మం అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో రాజ్యాధికారం కావాల‌ని బీజేపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో బ‌లంగా పార్టీ ఉన్న‌ప్ప‌టికీ ద‌క్షిణ తెలంగాణ జిల్లాల్లో పెద్దగా బ‌ల‌ప‌డ‌లేదు. ముంద‌స్తు ఎన్నిక‌ల వాతావ‌ర‌ణ౦ క‌నిపిస్తోన్న వేళ వెంట‌నే పార్టీని బ‌లోపేతం చేయ‌డం సంపూర్ణంగా సాధ్యం కాదు. అందుకే, క్షేత్ర‌స్థాయిలో ఓట‌ర్ల‌ను క‌లిగి ఉన్న టీడీపీ వైపు క‌మ‌ల‌నాథులు చూస్తున్నార‌ని తెలుస్తోంది. అందుకు సంబంధించిన సంప్ర‌దింపుల‌ను ఓ కీల‌క నేత జ‌రుపుతున్నార‌ని టాక్‌.

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ నిల‌బెట్టిన ద్రౌప‌ది ముర్ముకు టీడీపీ మ‌ద్ధ‌తు ప‌లికింది. నాలుగేళ్లుగా దూరంగా ఉన్న టీడీపీ, బీజేపీ ఒకే వేదిక‌పై క‌నిపించ‌డం ఇదే తొలిసారి. అంతేకాదు, అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు టీడీపీ చీఫ్ కు ఆహ్వానం పంపారు. ప్రోటోకాల్ ప్ర‌కారం ఆహ్వానాల‌పై ఫోన్ ద్వారా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సంప్ర‌దింపులు జ‌రిపారు. చంద్ర‌బాబుకు నేరుగా ఫోన్ చేసిన విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రావాల‌ని ఆహ్వానించారు. ప్ర‌తినిధిగా ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెంనాయుడు వెళ్లిన‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల‌న వేదిక‌పైకి వెళ్ల‌లేక‌పోయారు. అందుకు సంబంధించిన వివ‌ర‌ణ‌ను కూడా కిష‌న్ రెడ్డి ఇచ్చారు. అది జ‌రిగిన కొన్ని రోజుల‌కు ముర్ము రూపంలో బీజేపీ, టీడీపీ విజ‌య‌వాడ కేంద్రంగా ఒకే వేదిక‌పై క‌నిపించ‌డం ఆ రెండు పార్టీల పొత్తుల‌పై చ‌ర్చ‌కు ఆస్కారం ఏర్ప‌డింది.

తెలంగాణ వ్యాప్తంగా టీడీపీకి ప్ర‌త్యేక‌మైన ఓటు బ్యాంకు ఉంది. పార్టీని విడ‌చిపెట్టి లీడ‌ర్లు టీఆర్ఎస్ లోకి ఎక్కువ‌గా వెళ్లారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీత‌క్క‌లాంటి వాళ్లు కాంగ్రెస్ లోకి వెళ్లారు. కానీ, గ్రామ‌, మండ‌ల స్థాయి క్యాడ‌ర్ ఇప్ప‌టికీ టీడీపీని ఆదరిస్తోంది. వెనుక‌బ‌డిన వ‌ర్గాల ఓటు బ్యాంకు ఆ పార్టీకి ప‌దిలంగా ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల‌ను ఏక‌కాలంలో దెబ్బ‌తీయాలంటే, టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళితే తేలిక అవుతుంద‌ని క‌మ‌ల‌నాథుల భావ‌న‌. పైగా టీడీపీ లీడ‌ర్లు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నందున ఓట‌ర్ల‌ను సానుకూలంగా తిప్పుకోవ‌డానికి టీడీపీని ఉప‌యోగించుకోవాల‌ని బీజేపీ మాస్ట‌ర్ స్కెచ్ వేసింద‌ని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా బీజేపీకి ఏపీలో స్థానం లేదు. 2014 ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకోవ‌డంతో ఇద్ద‌రు ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను గెలుచుకోగ‌లిగింది. ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యంగా ఉంటూ ఏపీ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర అయింది. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీతో ఉన్న బీజేపీ ఏ మాత్రం సానుకూల ఫ‌లితాల‌ను సాధించ‌లేక‌పోతోంది. ఇలాంటి త‌రుణంలో ఏపీలో ఉనికిని చాటుకోవ‌డానికి టీడీపీతో పొత్తు అనివార్యంగా ఆ పార్టీకి క‌నిపిస్తోంది. తెలంగాణలో రాజ్యాధికారం కోసం ఖ‌మ్మం, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్ర‌త్యేక ఓటు బ్యాంకు ఉన్న టీడీపీని క‌లుపుకోవాల‌ని ప్లాన్ చేస్తోంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అధికార పార్టీల‌కు రాజకీయ శ‌త్రువుగా ఉన్న చంద్ర‌బాబు చాణక్యాన్ని ఉప‌యోగించుకుని ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని క‌మ‌ల‌నాథుల ఉవ్విళ్లూరుతున్నార‌ని వినికిడి. ఆ క్ర‌మంలోనే టీడీపీతో క‌లిసి వెళ్లే సంకేతాల‌ను బీజేపీ ఇస్తోంది. అదే జ‌రిగితే, తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు అనూహ్యంగా మార‌డంతో పాటు అన్న‌ద‌మ్ముల్లా మెలుగుతోన్న కేసీఆర్‌, జ‌గ‌న్ పీఠాలు క‌దిలే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.