Chandrababu Tour: వ‌స్తున్నా..తెలంగాణ‌కు.!

`స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం` తీసుకోవ‌డం తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకు తెలుసు.

  • Written By:
  • Updated On - June 23, 2022 / 09:50 AM IST

`స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం` తీసుకోవ‌డం తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకు తెలుసు. ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ తిరిగి పార్టీని బ‌తికించ‌డానికి స‌మ‌యం వ‌చ్చింది. అందుకే, ఆయ‌న ఖ‌మ్మం జిల్లా నుంచి స‌రికొత్త పంథాలో ఆరంగేట్రం చేస్తున్నారు. ఈనెల 24 వ తేదీన మ‌దిర నియెజ‌క‌వ‌ర్గం చింత‌కాని మండ‌లం పాత‌ర్ల‌పాడు గ్రామంలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని అవిష్క‌రించ‌డానికి వెళ్ల‌నున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే త‌ర‌హాలో ఆయ‌న తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.

చాలా కాలంగా తెలంగాణ టీడీపీకి పూర్వ వైభ‌వం తీసుకురావాల‌ని క్యాడ‌ర్ కోరుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు చంద్ర‌బాబు ఏపీ రాజ‌కీయాల్లో బిజీగా ఉండిపోయారు. ఇటీవల హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ భ‌వ‌న్లో నిర్వ‌హించిన పొలిట్ బ్యూరో స‌మావేశంలోనూ తెలంగాణ రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఒకానొక సంద‌ర్భంగా జూనియ‌ర్ కు తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని బాబు యోచించార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ మేర‌కు కీల‌క‌మైన నంద‌మూరి కుటుంబంకు చెందిన వ్య‌క్తి రాయ‌భారం చేశార‌ని తెలిసింది. కానీ, జూనియ‌ర్ నుంచి ఎలాంటి స‌మాధానం రాక‌పోవ‌డంతో నేరుగా చంద్ర‌బాబు రంగంలోకి దిగాల‌ని భావిస్తున్నార‌ట‌.

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ ప్ర‌త్యామ్నాయం ఎజెండా అందుకోవ‌డం చంద్ర‌బాబుకు స‌రైన స‌మ‌యం క‌లిసొచ్చింది. ప్రాంతీయ‌వాదాన్ని ప‌క్క‌న‌పెట్టిన కేసీఆర్ జాతీయ‌వాదాన్ని అందుకున్నారు. స‌మైక్య‌వాదానికి కేసీఆర్ కూడా సానుకూలంగా అడుగులు వేస్తున్నారు. దేశం స‌మైక్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నారు. ఆక్ర‌మంలో తెలంగాణ ప్రాంతీయ వాదాన్ని కేసీఆర్ దాదాపు కింద‌ప‌డేశారు. ఇదే స‌రైన స‌మ‌యంగా భావించిన చంద్ర‌బాబు తెలంగాణ టీడీపీని బ‌తికించుకునే ప‌నిలో ప‌డ్డారు. అత్యంత బ‌లంగా ఉండే ఖ‌మ్మం జిల్లా నుంచి టీడీపీ పూర్వ వైభ‌వానికి అడుగులు వేస్తోంది.

రాష్ట్రం విడిపోయిన త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ పొత్తు 19 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించింది. ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పెద్ద‌గా తెలంగాణ గురించి ప‌ట్టించుకోలేదు. పూర్తిగా ఏపీ మీద ఆయ‌న దృష్టి పెట్టారు. అయిన‌ప్ప‌టికీ టీడీపీ 15 మంది ఎమ్మెల్యేల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు ఇచ్చారు. అంటే, ఎంత బ‌లంగా తెలంగాణ ప్రాంతంలో టీడీపీ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికీ వెనుక‌బ‌డిన వ‌ర్గాలు టీడీపీని సొంత పార్టీగా భావిస్తుంటారు. గ్రేట‌ర్ హైద‌రారాబాద్, రంగారెడ్డి, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో టీడీపీకి ఓట‌ర్లు ఇప్ప‌టికీ ఆశించిన మేర‌కు ఉన్నారు. కానీ, స‌రైన లీడ‌ర్లు లేక‌పోవ‌డమే పెద్ద డ్రా బ్యాక్‌. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల్లో 80శాతం మంది గ‌తంలో టీడీపీకి ప‌నిచేసిన వాళ్లే. దీంతో టీడీపీకి లీడ‌ర్ షిప్ కొర‌త టీడీపీకి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం కొన్ని జిల్లాల్లో క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఇంచార్జిల‌ను కూడా నియ‌మించింది. కుప్ప‌కూలిన పార్టీని మ‌ళ్లీ నిర్మాణం చేస్తోంది.
Also Read : 

Chandrababu Naidu : చంద్ర‌బాబు “షాడో”స్.!

రాబోయే రోజుల్లో చంద్ర‌బాబు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా బ‌స్సు యాత్ర‌ను చేయ‌డానికి సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఏర్ప‌డిన కొత్త జిల్లాల వారీగా వారానికి ఒక్కో జిల్లా చొప్పున ప‌ర్య‌టిస్తున్నారు. అలాగే, వీకెండ్ లో తెలంగాణ‌లోని ఒక జిల్లాను ట‌చ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీంతో టీడీపీ క్యాడ‌ర్ లో నూత‌నోత్సాహం క‌నిపిస్తోంది.