TDP – BJP Alliance : టీడీపీతో క‌లిస్తే బీజేపీకి లాభ‌మా? ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు.. మోదీ, షా వ్యూహం అదుర్స్‌?

తెలంగాణ‌లో టీడీపీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. కీల‌క నేత‌లంతా పార్టీని వీడిన‌ప్ప‌టికీ కార్య‌క‌ర్త‌లు టీడీపీని అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో ప‌ది ఉమ్మ‌డి జిల్లాల్లో దాదాపు ఐదారు జిల్లాల్లో టీడీపీ ప్ర‌భావం ఉంటుంది.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 08:06 PM IST

తెలంగాణ‌(Telangana)లో అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీ(BJP) అధిష్టానం దృష్టిసారించింది. క‌ర్ణాట‌క(Karnataka) ఎన్నిక‌ల్లో ఓట‌మితో ద‌క్షిణాదిన అధికారంలో ఉన్న ఒక్క‌రాష్ట్రాన్నిసైతం బీజేపీ కోల్పోయింది. ప్ర‌స్తుతం బీజేపీ కేంద్ర పార్టీ దృష్టి తెలంగాణ‌పై ప‌డింది. తెలంగాణ‌లో బీజేపీ కొంత‌మేర బ‌లంగా ఉండ‌టంతో గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే అధికారంలోకి వ‌స్తామ‌న్న ఆశ‌తో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు. మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉండ‌టంతో తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా ఆపార్టీ నేత‌లు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి వెళితే లాభం ఉంటుంద‌ని బీజేపీ కేంద్ర పెద్ద‌లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల అమిత్ షా(Amit Shah), జేపీ న‌డ్డాల‌తో టీడీపీ(TDP) అధినేత‌ చంద్ర‌బాబు(Chandrababu) బేటీ అయ్యార‌న్న చ‌ర్చ జ‌రుగుతుంది.

తెలంగాణ‌లో టీడీపీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. కీల‌క నేత‌లంతా పార్టీని వీడిన‌ప్ప‌టికీ కార్య‌క‌ర్త‌లు టీడీపీని అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో ప‌ది ఉమ్మ‌డి జిల్లాల్లో దాదాపు ఐదారు జిల్లాల్లో టీడీపీ ప్ర‌భావం ఉంటుంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగాపెట్టుకున్న బీజేపీ పెద్ద‌లు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే లాభ‌ప‌డ‌తామ‌న్న భావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల అమిత్ షా, జేపీ న‌డ్డాల‌తో చంద్ర‌బాబు భేటీ కావ‌టం, రెండు రోజులు గ‌డ‌వ‌క ముందే తెలంగాణ టీడీపీ నేత‌ల‌తో చంద్ర‌బాబు భేటీ కావ‌టం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, తెలంగాణ బీజేపీలోని కొంద‌రు నేత‌లు టీడీపీతో పొత్తు వ‌ద్ద‌ని కేంద్ర పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం.

తెలంగాణ‌లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు ఎదురైన ప‌రిస్థితే బీజేపీకి ఎదుర‌వుతుంద‌ని కొంద‌రు నేత‌లు అదిష్టానం వ‌ద్ద వాదిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, అమిత్ షా, జేపీ న‌డ్డాలు మాత్రం ప‌క్కావ్యూహంతో టీడీపీతో పొత్తుకు సై అంటున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నే విష‌యంపై ప‌లు ద‌ఫాలుగా స‌ర్వేలు చేయించార‌ని, ఆ స‌ర్వే ఫ‌లితాల‌ను బేరీజు వేసుకొని టీడీపీతో పొత్తుకు సై అంటున్న‌ట్లు బీజేపీలోని ఓ వ‌ర్గం నేత‌ల వాద‌న‌గా తెలుస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ క్యాడ‌ర్ బీఆర్ఎస్ వైపు కొంత‌, కాంగ్రెస్ వైపు కొంత వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కావ‌టంతో టీడీపీ క్యాడ‌ర్ రేవంత్ ను బ‌ల‌ప‌ర్చేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు తెలంగాణ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకుంటే బీఆర్ఎస్‌, కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు మ‌ళ్లీ సొంత‌గూటికి రావ‌టం ఖాయ‌మ‌ని, త‌ద్వారా బీజేపీకి బ‌ల‌మైన ఓటుబ్యాంక్ గా వారు మార‌తార‌ని బీజేపీ కేంద్ర పెద్ద‌లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

Also Read : Telangana BJP : తెలంగాణ బీజేపీకి ఏమైంది..? కాంగ్రెస్ దూకుడుతో తేలిపోతున్న క‌మ‌లం.. కోవ‌ర్టులే కార‌ణ‌మా?