ధరణి దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్(Congress) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. రైతులను మనోవేదనకు గురి చేస్తున్న ధరణి పోర్టల్ రద్దు, ఏకకాలంలో సంపూర్ణ రుణమాఫీ, రైతుల వద్ద నుంచి సకాలంలో ధాన్యం సేకరణ ,యాసంగి పంటకు రైతు బీమా పథకం అమలు, మిల్లర్ల దోపిడీకి గురవుతున్న రైతుల సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా, నిరసన చేపట్టి కలెక్టర్ లకు మెమోరాండం లు సమర్పించే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రజలు, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గని విజయవంతం చేశారు.
ధరణి పోర్టల్‌ను (Dharani) నిర్వహించడంలో ప్రైవేట్ కంపెనీల ప్రమేయాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ పద్ధతి భూ యాజమాన్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఆరోపిస్తూ, పోర్టల్‌ను ఉపయోగించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియానుద్దేశించి మాట్లాడారు. ధరణి పోర్టల్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని, ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలు మోసపోతున్నారని రేవంత్ కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఒక్క ఏడాది ప్రజలందరూ ఈ కష్టాలను భరిస్తే వచ్చే కాంగ్రెస్ (Congress) పార్టీ రైతు ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలకు అవకాశం ఉండదని, ప్రజలందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని ఆయన చెప్పారు. ఈ ధర్నా, నిరసన కార్యక్రమాలలో అన్ని నియోజకవర్గం లోని బ్లాక్, అన్ని మండలాల, మున్సిపాలిటీల, కార్పొరేషన్ల అధ్యక్షులు ,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ,మాజీ ప్రజా ప్రతినిధులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Aslo Read : Fake Baba: ఫేక్ బాబా అరెస్ట్.. నగ్న ఫొటోలు లభ్యం