Site icon HashtagU Telugu

Cong leaders arrest: అరెస్టులను ఖండించిన మల్లు భట్టివిక్రమార్క

jagga reddy arrest

jagga reddy arrest

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ లో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ ఈ నెల 7వ తేదీన ఓయూలో పర్యటించడానికి ఓయూ వీసీ, ప్రభుత్వం అనుమతివ్వాలంటూ ఆదివారం NSUI అధ్యక్షులు వెంకట్ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థులు ఆందోళన చేయగా, వారిని పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన విషయం తెలుసుకుని అరెస్టు అయిన విద్యార్థులను పరామర్శించడానికి అక్కడికి వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారా హిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పరామర్శ చేయడం కూడా నేరం అయినట్టుగా పోలీసులు వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యాంగం ద్వారా సంకల్పించిన వాక్ స్వాతంత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల రక్షణ కోసం పని చేయాల్సిన పోలీసులు పాలకుల మెప్పు కోసం పని చేస్తున్నారని విమర్శించారు. జగ్గారెడ్డిని అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రకారం గా ఓయు విద్యార్థులు చేసిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డుకోవడం తగదన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను జగ్గారెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పి తక్షణమే విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలను చూసి చలించిపోయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అమరవీరుల ఆశయాలు నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. దశాబ్దాల కలను నెరవేర్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతా భావంతో ఉండాలన్న విషయాన్ని విస్మరించి సోనియా తనయుడు రాహుల్ గాంధీ ఓయూలో పర్యటించడానికి అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కుటుంబానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు. ఓయులో నిర్వహించే రాహుల్ గాంధీ పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Exit mobile version