తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు ఎన్నిక ప్రచార రంగంలోకి అడుగుపెట్టారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలో తిరుగుండ్లపల్లి, తమ్మడపల్లిలో రోడ్ షో లో బండి పాల్గొన్నారు. స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. బీజేపీ అభ్యర్థి Komatireddy Raj Gopal Reddy గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేశారు బండి సంజయ్. ఆ తర్వాత రోడ్డు షోకు పెద్దఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏమైతదన్నోళ్లే.. ఇవాళ మునుగోడు మీద దండుపాళ్యం ముఠాలా పడ్డారని బండి సంజయ్ అరోపించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఏకంగా సీఎం కేసీఆర్ దిగొచ్చి లెంకలపల్లికి పరిమితమై ఓట్లు అడిగే స్థాయికి తీసుకొచ్చామని బండి సంజయ్ అన్నారు.
ఎన్నికల ప్రచారం పేరుతో టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడులో ఊరూరా తిరుగుతూ భూముల గురించి ఆరా తీస్తుందోని, టీఆర్ఎస్ గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గంలోని భూములన్నీ కబ్జా చేయబోతున్నారని బండి మండిపడ్డారు. మునుగోడులో గెలిచేందుకు టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.40 వేలు ఇస్తున్నారని, ఆ పైసలు తీసుకొని బీజేపీకి ఓటు వేయాలని బండి కోరారు. ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఎంతోమందికి సాయం చేశారని, ఆయన ఇంటికి ఏ పేద వ్యక్తి పోయినా సంతోషంగా తిరిగివస్తారనే పేరుందని, అలాంటి వ్యక్తిని గెలిపించాలని బండి సంజయ్ అన్నారు.