Telangana IT : తెలంగాణ ఐటీ విధానాల‌ను మేము అనుస‌రిస్తాం – త‌మిళ‌నాడు ఐటీశాఖ మంత్రి ప‌ళ‌నివేల్‌

తెలంగాణ ఐటీ విధానాలు, వ్యూహాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని తమిళ‌నాడు ఐటీశాఖ మంత్రి డాక్ట‌ర్ ప‌ళ‌నివేల్

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 08:28 AM IST

తెలంగాణ ఐటీ విధానాలు, వ్యూహాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని తమిళ‌నాడు ఐటీశాఖ మంత్రి డాక్ట‌ర్ ప‌ళ‌నివేల్ త్యాగ‌రాజ‌న్ తెలిపారు. తెలంగాణలో ఐటీ విధానాల‌పై అధ్య‌య‌నం చేయ‌డానికి త‌మిళ‌నాడు మంత్రి ప‌ళ‌నివేల్ ఆయ‌న బృందంతో వ‌చ్చారు. తెలంగాణలో పటిష్టమైన ఐటీ రంగాన్ని అధ్యయనం చేసేందుకు మూడు రోజుల పర్యటనకు వచ్చిన బృందానికి ఆయన నేతృత్వం వహించారు. ప‌ళ‌నివేల్‌, ఆయ‌న‌ బృందం గచ్చిబౌలిలోని T-Works, T-Hub, WE Hub, T-Fiber ఆఫీస్‌తో కూడిన తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను సందర్శించారు. అనంతరం హైదరాబాద్‌లోని టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లో ఐటీ రంగంలోని వాటాదారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఐటీ శాఖ అధికారులు ఆయనకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, హైదరాబాద్ ఐటీ రంగంలో పటిష్టమైన అభివృద్ధిని సాధించిందని త్యాగ రాజన్ అన్నారు. హైదరాబాద్, బెంగళూరులతో సమానంగా తమిళనాడు ఉండాల్సి ఉన్నా గత ప్రభుత్వాల వల్ల ఐటీ రంగంలో ఆశించిన వృద్ధి రాలేదన్నారు. తమిళనాడు ఐటీ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పీటీఆర్ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధానాలు, కార్యక్రమాలను తెలుసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చానని చెప్పారు. హైదరాబాద్‌లోని ఐటీ రంగం గడిచిన తొమ్మిదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందిందని ఆయ‌న తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఐటీ విధానాన్ని తాము అవలంబిస్తామ‌ని.. ఐటీ, అనుబంధ రంగాలను పటిష్టంగా నిర్మించేందుకు తీసుకుంటున్న విధానాలు, పలు కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ త‌మ‌కు వివ‌రించార‌ని ఆయన తెలిపారు.