Site icon HashtagU Telugu

Governor Issue: రాజ్యాంగ యుద్ధం!

Tamilisai

Tamilisai

రాజ్ భవన్, ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరిగిందా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. గవర్నర్ ప్రోటోకాల్ ఇష్యూ.. సీఎం కేసీఆర్ తీరు.. మోడీ, అమిత్ షాతో తమిళిసై భేటీ.. లాంటి విషయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని గవర్నర్ చేసిన ఆరోపణపై కేటీఆర్ స్పందించారు. తమిళిసై సౌందరరాజన్‌ “గవర్నర్‌లా ప్రవర్తిస్తే” రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తుందని కేటీఆర్ అన్నారు. అయితే ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ తన అధికారిక పర్యటనలకు అధికారులు రాకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక వ్యక్తిగా తనకు సంబంధించినది కాదని, గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించాలని ఆమె స్పష్టం చేశారు.

అయితే తమిళిసై ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ పదవులను గౌరవిస్తుందని, గవర్నర్‌పై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. ‘గవర్నర్‌తో మనకెందుకు ఇబ్బంది అని.. గవర్నర్ గవర్నర్ లాగా ప్రవర్తిస్తే తప్పకుండా గౌరవిస్తాం. “ఆమె ఎక్కడ, ఎప్పుడు, ఎలా అవమానించబడింది?  అని ఆయన ప్రశ్నించారు. ‘‘నేను యాదాద్రి నరసింహ స్వామి ఆలయం వెళ్లినప్పుడు బీజేపీ జెండా పట్టుకున్నానా?.. బీజేపీకి చెందిన బెటాలియన్‌ వచ్చిందా?.. నా భర్తతో కలిసి సాధారణ భక్తురాలిగా అక్కడికి వెళ్లాను. EO,  కలెక్టర్ హాజరుకాకపోయినా బాధపడలేదు. లక్ష్మీ నరసింహుడిని ప్రార్థించటానికి వెళ్ళాను. అయితే ఆ తర్వాత రోజే గవర్నర్ కు అవమానం ఎదురైందని మీడియా లో వార్తలొచ్చాయని, ఈ విషయంలో నా తప్పేమీ లేదు’’ అని తమిళిసై సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల ప్రసంగానికి దూరం కావాల్సి వచ్చిందని తమిళిసై గుర్తుచేశారు.

కౌశిక్ రెడ్డిని శాసనమండలికి నామినేట్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసును ఆమోదించకపోవడంపై మంత్రి గవర్నర్‌పై మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్‌గా ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని కేటీఆర్‌ సూచించారు. కాగా, సౌందరరాజన్ గత రెండు రోజులుగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘వాళ్లు ఇస్తున్న గౌరవం ఇదేనా.. వ్యక్తిగా తనను అవమానించినా.. గవర్నర్ వ్యవస్థను గౌరవించాలి. రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి గైర్హాజరయ్యారని ఆమె అన్నారు. నేను గవర్నర్‌ని.. నేను రాజ్‌భవన్‌లో కూర్చున్న తెలంగాణ సోదరిని. నా అభిమానాన్ని గౌరవించాలా వద్దా.. మీరే చెప్పండి.. సాధారణ వ్యక్తిగా కాదు.. గవర్నర్‌గా కాదు. .సామాన్య వ్యక్తిగా స్త్రీని, చెల్లిని గౌరవించాలా వద్దా? అనేది నా ప్రశ్న’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తమిళిసై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.