Site icon HashtagU Telugu

AP Telangana Merger : ఏపీ, తెలంగాణ మ‌ళ్లీ విలీనం?

Talasani

Talasani

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మ‌ళ్లీ క‌లిసే అవ‌కాశం ఉందా? విభ‌జ‌న చ‌ట్టంలో ఆ అవ‌కాశాన్ని ఇచ్చారా? నిజంగా బీజేపీ ఆ దిశ‌గా ఆలోచిస్తోందా? అంటే తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌ను వింటే నిజ‌మేనేమో అనిపిస్తోంది. అంతే కాదు, ఏపీ మంత్రి పేర్ని నాని కూడా ఏపీని తెలంగాణ లో విలీనం చేస్తామ‌ని ఇటీవ‌ల వ్యాఖ్యానించాడు. అటు ఏపీ ఇటు తెలంగాణ మంత్రుల నోట ఏపీ, తెలంగాణ విలీనం మాట వ‌స్తోంది.ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న గురించి పార్ల‌మెంట్ వేదిక‌గా చాలా రోజుల త‌రువాత ప్ర‌స్తావించాడు. అశాస్త్రీయంగా విభ‌జ‌న జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పాడు. అంతేకాదు, పార్ల‌మెంట్ త‌లుపులు మూసి, పెప్ప‌ర్ స్ప్రే వెద‌జ‌ల్ల‌డం ద్వారా చీక‌ట్లో బిల్లును పాస్ చేశార‌ని అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ అహంకారంతో రాష్ట్రాన్ని విడ‌దీసింద‌ని మ‌నోభావాన్ని వ్య‌క్తంప‌రిచాడు. తెలంగాణ‌కు బీజేపీ మ‌ద్ధ‌తు ఇచ్చిన‌ప్ప‌టికీ పార్ల‌మెంట్లో బిల్లును చీక‌ట్లో ఎందుకు ఆమోదింప చేశార‌ని నిల‌దీశాడు.

మోడీ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్‌, కాంగ్రెస్ క‌లిసి నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నాయి. మంత్రులు సైతం మోడీని టార్గెట్ చేసి మాట్లాడారు. విచిత్రంగా తెలంగాణ మంత్రి త‌ల‌సాని మాత్రం ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ మేర‌కు క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని అనుమానించాడు. గుజరాత్ కంటే తెలంగాణ ఎక్కువ అభివృద్ధి చెందుతుండడం చూసి మోడీ విలీనం చేయాల‌ని అనుకుంటున్నాడ‌ని అన్నాడు.విభ‌జ‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను వెనుక్కు తీసుకోవ‌డంతో పాటు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. ప్రధాని క్షమాపణలు చెప్పేవరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని హెచ్చ‌రించాడు.
ఇటీవ‌ల తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రధాని మోదీ ఉమ్మడి రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మ‌ళ్లీ విలీనంపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.