Cabinet Meeting : ఇవాళ జరగాల్సిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంపై సస్పెన్స్ నెలకొంది. ఈ సమావేశం నిర్వహణకు అవకాశం ఇవ్వాలంటూ రెండు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సర్కారు లేఖ రాయగా.. ఇప్పటివరకు ఇంకా అనుమతి మంజూరు కాలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున క్యాబినెట్ భేటీ కోసం అనుమతి ఇవ్వాలని ఈసీని తెలంగాణ సర్కారు కోరింది. అనుమతి ఇంకా రాకపోవడంతో క్యాబినెట్ భేటీ జరుగుతుందా ? లేదా ? అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఒకవేళ ఈసీ నుంచి పర్మిషన్ రాకున్నా రాష్ట్ర క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించుకోవచ్చని.. అయితే అందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల సమాచారాన్ని బహిర్గతం చేయకూడదనే నిబంధన ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ జరిగే సమావేశానికి ‘క్యాబినెట్ మీటింగ్’(Cabinet Meeting) బదులుగా ‘మంత్రుల సమావేశం’ అనే పేరును వాడుకోవాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ఒకవేళ ఇవాళ తెలంగాణ మంత్రుల సమావేశం జరిగినా.. అందులో తీసుకునే నిర్ణయాల వివరాలపై ప్రకటన వెలువడకపోవచ్చని సంబంధిత వర్గాలు అంటున్నాయి. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేసే అంశంపై ఇప్పటికే ఆ శాఖ మంత్రి, అధికారులతో ఇప్పటికే సీఎం రేవంత్ సమావేశాన్ని నిర్వహించారు. భూ సమస్యలపై ధరణి కమిటీ మీటింగ్ కూడా ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారమే జరిగింది. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున తెలంగాణ క్యాబినెట్ సమావేశం కూడా రివ్యూ మీటింగ్ తరహాలోనే జరిగే అవకాశం ఉందంట. రైతు రుణమాఫీ, ఏపీ-తెలంగాణ విభజనకు సంబంధించిన అంశాలు, జూన్ 2 నుంచి హైదరాబాద్ కేవలం తెలంగాణకే రాజధానిగా ఉంటుందనే అంశాలపై క్యాబినెట్ భేటీలో చర్చించాలని తొలుత భావించారు. ఇవాళ మరి ఆ టాపిక్స్‌పైనే డిస్కషన్ జరుగుతుందా ? మరేవైనా కొత్త అంశాలపై చర్చిస్తారా ? అనేది మీటింగ్ తర్వాతే తెలుస్తుంది.