Final Cabinet Meeting : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 11లోగా ఏ రోజైనా ఎన్నికల షెడ్యూల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే ఈలోగా రాష్ట్ర క్యాబినెట్ చివరి సమావేశం జరుగుతుందా ? జరగదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. క్యాబినెట్ భేటీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆ మీటింగ్ ఇటీవల వాయిదా పడింది. కేసీఆర్‌కు ఇంట్లోనే వైద్య బృందం చికిత్స చేస్తోందని కేటీఆర్ ఇటీవల ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొద్ది రోజుల్లోనే సీఎం సాధారణ స్థితిలోకి చేరుకుంటారని చెప్పారు. వైరల్ ఫీవర్ కారణంగా గత మూడు వారాలుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చివరగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో కనిపించిన సీఎం.. ఆ తర్వాత ప్రగతిభవన్‌లో జరిగిన వినాయక పూజలో కనిపించారు. వినాయక చతుర్ధి తర్వాత నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కూడా అధికారిక కార్యక్రమాలకు వెళ్లలేదు. ఈనేపథ్యంలో ఇంకో రెండు,మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో.. చివరి క్యాబినెట్ భేటీ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join
ఎన్నికల షెడ్యూలు వస్తే.. ఇక చివరి క్యాబినెట్ భేటీ ఉండదనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందు నిర్వహించే క్యాబినెట్ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలను ఆకర్షించే కీలక నిర్ణయాలను ప్రకటించేందుకు చివరి క్యాబినెట్ సమావేశాలను వేదికగా వాడుకొనే రాజకీయ సంప్రదాయం మన దేశంలో ఉంది. ఒకవేళ క్యాబినెట్ సమావేశం నిర్వహించే పరిస్థితి లేకుంటే.. కీలకమైన నిర్ణయాలకు సంబంధించి సర్య్యులేషన్ పద్ధతిలో మంత్రుల నుంచి సంతకాలు తీసుకుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని నిర్ణయాలకు సంబంధించి సర్య్యులేషన్ పద్ధతిలో మంత్రుల నుంచి సంతకాలు తీసుకున్నారని అంటున్నాయి. ఇటీవల ఈవిధంగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం ఐఆర్ ను (Final Cabinet Meeting) ప్రకటించారని గుర్తు చేస్తున్నారు.