తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ రాష్ట్ర సమితి (BRS) అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఆయన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులపై నిరంతరం నిఘా పెట్టారని విచారణాధికారులు గుర్తించినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక వెల్లడించింది. 2021 జులై నుండి 2023 డిసెంబర్ వరకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఈ నిఘా కార్యకలాపాలు నిర్వహించినట్లు అధికారిక పత్రాలు మరియు దర్యాప్తు అధికారుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా తెలిసింది. విచారణ అధికారుల ప్రకారం, రేవంత్ రెడ్డిపై ప్రత్యేక నిఘా కోసం ఒక ప్రత్యేకమైన మాడ్యూల్‌ను కూడా ఏర్పాటు చేశారు.
Guvvala Balaraju : బీజేపీలోకి గువ్వల బాలరాజు
‘RR మాడ్యూల్’ ద్వారా నిఘా
దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం.. అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) డిఎస్పీ ప్రణీత్ రావు మరియు అతని బృందం “RR (రేవంత్ రెడ్డి) మాడ్యూల్” పేరుతో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, మరియు పార్టీ సన్నిహితుల ప్రొఫైల్స్ తయారు చేశారు. ఈ మాడ్యూల్ ద్వారా వారి కదలికలు, ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు వంటి అన్ని వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురు నిందితులలో ఒకరైన ప్రణీత్ రావు, మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ప్రభాకర్ రావు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నిధుల సేకరణ అడ్డుకోవడమే లక్ష్యం?
కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే కాకుండా, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఇతర రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అధికారులు, హైకోర్టు న్యాయమూర్తిపై కూడా నిఘా పెట్టారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులకు ఎన్నికల సమయంలో నిధులు అందకుండా చూడటం ఈ నిఘా ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా 2022 మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీకి చెందిన కొంతమంది నాయకుల నుంచి రూ. 1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తోంది.