Telangana : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మార్చిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్పీకర్ అనర్హత పిటిషన్లపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపరేషన్ సక్సెస్… పేషెంట్ డెడ్ అన్న పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధుల మార్పిడి వ్యవహారాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది.
Read Also: Vijayawada : ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా పెరుగుతున్న వరద ఉధృతి.. అధికారుల హెచ్చరిక
బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జీ జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్‌లు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈ క్రమంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇవన్నీ కలిపి 2024 జనవరి 15న సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి. మొత్తం తొమ్మిదిసార్లు ఈ కేసులు విచారణకు వచ్చాయి. చివరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు పూర్తయిన అనంతరం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పి.శ్రీనివాస రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, ఎ.గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్‌లు ఉన్నారు.
ఈ ఏడాది ఆరంభంలోనే పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే స్పీకర్ వాటిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌కు మూడు నెలల గడువులోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంలో తాము నేరుగా జోక్యం చేయలేమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో “న్యాయస్థానం అనర్హతను నిర్ణయించాలన్నది రాజ్యాంగ విరుద్ధం” అంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం, ప్రజా ప్రతినిధుల అనర్హత వంటి రాజ్యాంగపరమైన అంశాల్లో రాజ్యాంగ సంస్థల పాత్రను పరిరక్షించే దిశగా కీలక సూచనలు చేసింది. ఈ తీర్పుతో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.