BRS Defecting MLAs: పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ అయిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ఉన్నారు. 8 వారాల్లోగా తీర్పును వెలువరించాలని బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం కోర్టును కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్లు వేశారు. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ ఇవాళ(గురువారం) వాదనలు వినిపించారు.
Also Read :Warangal Chapata : వరంగల్ చపాటా మిర్చికి ‘జీఐ’ గుడ్ న్యూస్.. ప్రత్యేకతలివీ
ఇవాళ విచారణ జరిగింది ఇలా..
- తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘‘స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవు’’ అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. ‘‘మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏమిటి’’ అని ప్రశ్నించారు. ‘‘2028 జనవరి-ఫిబ్రవరి వరకు ఎదురు చూసేలా వ్యవస్థను మార్చేందుకు అనుమతించాలా ? మేం కొంత న్యాయసమ్మతమైన ధోరణిని ఆశిస్తున్నాం’’ అని సింఘ్వీని ఉద్దేశించి జస్టిస్ గవాయ్ కామెంట్ చేశారు. ‘‘న్యాయవాదులు ఇలాంటి కేసుల్లో వ్యవహరించే విధానం ఇబ్బందికరంగా ఉంటోంది. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోంది’’ అని గవాయ్ వ్యాఖ్యానించారు.
- ‘‘అనర్హత పిటిషన్లపై విచారణకు మీకు ఎంత సమయం కావాలి?’’ అని జస్టిస్ గవాయ్(BRS Defecting MLAs) ప్రశ్నించగా.. ‘‘ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు నెలల సమయం కావాలి’’ అని న్యాయవాది సింఘ్వీ చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 నెలల సమయం వేస్ట్ అయింది. మరో ఆరు నెలలు ఎలా అడుగుతారు అని గవాయ్ నిలదీశారు. ఇన్ని నెలలు గడిచాక కూడా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదా అని ప్రశ్నించారు.
- కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం కలుగజేసుకొని.. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. ‘‘ఉప ఎన్నికలు రావు.. స్పీకర్ తరఫున కూడా చెబుతున్నా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారన్నారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచైనా రక్షణ ఉంటుందని రేవంత్ అన్నారని న్యాయవాది ఆర్యామ సుందరం చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘‘సీఎం రేవంత్ స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాగే చేశారు’’ అని కామెంట్ చేశారు.
- ఈక్రమంలో న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ కలుగజేసుకొని.. ‘‘ప్రతిపక్ష బీఆర్ఎస్ వైపు నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయి’’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం అంటూ వాటిని ధర్మాసనం పక్కన పెట్టింది. సీఎం వ్యాఖ్యలను కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ‘‘మేం(న్యాయ వ్యవస్థ) సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండు వ్యవస్థలు కూడా అదే గౌరవంతో వ్యవహరించాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
- తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని న్యాయవాది సింఘ్వీ పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘‘ సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే, కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదు’’ అన్నారు.