Site icon HashtagU Telugu

CM Revanth Reddy : సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట

CM Revanth

CM Revanth

CM Revanth Reddy : సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) చట్టం కింద నమోదు అయిన కేసులో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనపై సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును ఎన్ పెద్దిరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఈ కేసును సమగ్రంగా పరిశీలించి, రేవంత్ రెడ్డిపై ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ కేసును క్వాష్ చేసింది. అయితే, ఆ తీర్పుతో అసంతృప్తి చెందిన ఎన్ పెద్దిరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. కేసు వాస్తవాలను పరిశీలించిన ధర్మాసనం, ఇది సరైన కారణాలతో దాఖలు చేయబడలేదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, పిటిషనర్ ఎన్ పెద్దిరాజుతోపాటు ఆయన తరపు న్యాయవాది రితీష్ పాటిల్‌పై కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్, కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తదుపరి విచారణకు పిటిషనర్ ఎన్ పెద్దిరాజు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. కోర్టు ధిక్కరణ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ, ఆ సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Breakup : బ్రేకప్ అయ్యిందని బాధపడుతున్నారా..? ఇలా చేస్తే మీరు ఫుల్ హ్యాపీ

పిటిషనర్ తరపు న్యాయవాది రితీష్ పాటిల్ కోర్టులో క్షమాపణ కోరుతూ, కేసును వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే, చీఫ్ జస్టిస్ దీనిపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తి, కోర్టును అవమానించే విధంగా వ్యవహరించడాన్ని సహించబోమని హెచ్చరించారు. కేసు తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేశారు.

గత వారం తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, కేసును పూర్తిగా క్వాష్ చేసింది. 2016లో గోపనపల్లి గ్రామంలోని భూముల వివాదానికి సంబంధించిన కేసులో ఎన్ పెద్దిరాజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎస్సీ మ్యూచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూమిలో అక్రమంగా ప్రవేశించి, జేసీబీలతో నిర్మాణాలను కూల్చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఎన్ పెద్దిరాజు ఫిర్యాదు ప్రకారం, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి , ఇతరులు అక్కడ హాజరై, కుల వివక్షతో తనను అవమానించారని పేర్కొన్నారు. అంతా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగిందని పెద్దిరాజు ఆరోపించారు. అయితే, హైకోర్టు ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని తేల్చి కేసును రద్దు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పెద్దిరాజు పిటిషన్‌ను కొట్టివేయడం రేవంత్ రెడ్డికి పెద్ద ఊరట కలిగించింది.

Madhya Pradesh : మంచంపై ప్రసవం కోసం పోరాటం.. మధ్యప్రదేశ్‌లో మహిళ చిగురొదలిన బాధ