Site icon HashtagU Telugu

MLC post : కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ల ఎమ్మెల్సీ పదవులు రద్దు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court cancels MLC posts of Kodandaram and Aamir Ali Khan: Key verdict

Supreme Court cancels MLC posts of Kodandaram and Aamir Ali Khan: Key verdict

MLC post : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటా ద్వారా ఇటీవల ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, ప్రముఖ జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్‌ల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం బుధవారం తీర్పును వెలువరించింది. ప్రభుత్వం కొత్తగా నామినేట్ చేసే వ్యక్తుల నియామకాలు కూడా తుది తీర్పునకు లోబడి ఉంటాయి అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.

పరిణామాల పూర్వాపరాలు

2023 ఆగస్టులో అప్పటి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం మాజీ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సెప్టెంబర్ 19న రాజకీయంగా అనుబంధమున్న వ్యక్తులుగా పేర్కొంటూ వీరి నామినేషన్లను తిరస్కరించారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి వీరి పేర్లను పంపలేదు. ఈ లోగా ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ 2024 జనవరిలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. గవర్నర్ ఈ పేర్లను ఆమోదించారు. అయితే, తన పేరును తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని భావించిన శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు, సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పులు

తెలంగాణ హైకోర్టు విచారణలో గవర్నర్ రాజకీయ పరంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొంటూ, 2023లో శ్రవణ్, సత్యనారాయణల నామినేషన్లను తిరస్కరించిన ఆదేశాలను రద్దు చేసింది. అలాగే, కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ల నామినేషన్ల నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు రద్దు చేసింది. అయితే, మళ్లీ కొత్తగా వారినే సిఫారసు చేస్తూ ప్రభుత్వం అడుగులు వేసింది. దీంతో అసలు న్యాయం తమకే జరగాలని భావించిన శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు వారికో నిరాశను మిగిల్చింది. ఎమ్మెల్సీల నామినేషన్‌ అంశంలో కేబినెట్‌ సిఫారసు కీలకం. అందువల్ల నేరుగా మిమ్మల్ని ఎమ్మెల్సీలుగా నియమించాలన్న ఆదేశాలు ఇవ్వలేం అంటూ తేల్చి చెప్పింది.

ప్రమాణ స్వీకారం తుది తీర్పుకు లోబడి

కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆంక్షలు తొలగించడంతో వారు ఆగస్టు 16న అధికారికంగా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ, వీరి నియామకాలు తుది తీర్పును ఆధారంగా ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే సెప్టెంబర్ 17వ తేదీని కీలక దినంగా భావించవచ్చు. ఇక, మరోవైపు, దాసోజు శ్రవణ్ ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. దీంతో గవర్నర్ కోటా ఎపిసోడ్‌లో ఆయనకు తిరిగి ఎమ్మెల్సీ పదవి లభించడంపై ఆసక్తి తగ్గినట్లే. కానీ కుర్ర సత్యనారాయణకు మాత్రం న్యాయపోరాటం కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాజకీయ ప్రయోజనాల పోటీగా మారిన గవర్నర్ కోటా

ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రపతి, గవర్నర్, మంత్రివర్గాల హద్దుల మధ్య రాజ్యాంగ ప్రమేయం ఎలా ఉండాలో మరోసారి చర్చకు తెరలేపింది. గవర్నర్ కోటా అసలు ఉద్దేశం నిపుణులను శాసన మండలిలోకి తీసుకురావడమే. కానీ, రాజకీయ హస్తక్షేపాలతో అది కొంత మేర విస్తరించటం, న్యాయస్థానాల మధ్య వివాదాస్పదమవడాన్ని ఈ పరిణామాలు చూపిస్తున్నాయి.

Read Also: AP : ఏడాది చివరిలోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు: మంత్రి అనగాని