తమ సిట్టింగ్ స్థానం మునుగోడుపై కాంగ్రెస్ ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తోంది. అటు కోమటిరెడ్డి బ్రదర్స్, ఇటు పార్టీ విభేదాలు, సీనియర్ నేతలు ప్రచారానికి దూరంగా ఉండటం లాంటి అంశాలు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. కాంగ్రెస్ మునుగోడులో ఓడిపోవడమే కాకుండా నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వేలో 40 శాతం మంది కింది స్థాయి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పార్టీని వీడి టీఆర్ఎస్, బీజేపీలో చేరినట్టు సమాచారం.
Also Read: TRS and Congress: ‘దిగ్విజయ్’ రూపంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు
ఎంటీసీలు, సర్పంచులు, వార్డుమెంబర్స్, గ్రామస్థాయి నేతలు రాజగోపాల్ రెడ్డితో చేతులు కలిపారు. రానున్న రోజుల్లో మరికొంతమంది నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని సర్వే అంచనా వేసింది. ఈ దుస్థితికి తోడు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మినహా ఎవరూ పార్టీ ప్రచారంపై ఆసక్తి చూపడం లేదు. జానా రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీ పనులపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మునుగోడులో అప్పుడప్పుడు పార్టీ సమావేశానికి హాజరవుతున్నారు. అంతకు మించి పెద్దగా ఏమీ చేయడం లేదు.
Also Read: Divyavani Met Etela: ఈటలతో దివ్యవాణి భేటీ.. త్వరలో బిజేపీలోకి?
కోమటిరెడ్డిని ఓడిస్తానని గొప్పలు చెప్పుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిత్యం మునుగోడు నియోజకవర్గంలో పర్యటించే తీరిక కూడా లేకపోవడం మరింత శోచనీయం. మునుగోడులో పోరు ప్రారంభం కాకముందే కాంగ్రెస్ కథ ముగిసిందని సునీల్ కనుగోలు నివేదిక ఈ విషయం స్పష్టమైందట. దాదాపు మునుగోడులో కాంగ్రెస్ రేసులో లేదు. ఇంకా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసలు ఆ పార్టీని లోలోపల నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పార్టీ హైకమాండ్ ఎలా వ్యవహరిస్తుంది? అనే విషయం ఆసక్తిగా మారనుంది.