Adilabad: అడవుల జిల్లా అడుగంటుతోంది!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు భూగర్భజలాలు సైతం అడుగంటిపోతున్నాయి.

  • Written By:
  • Updated On - March 3, 2022 / 09:21 PM IST

శివరాత్రి వచ్చి రెండు మూడు రోజులైన కూడా కాలేదు.. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు భూగర్భజలాలు సైతం అడుగంటిపోతున్నాయి. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ లోని మారుమూల గ్రామాలు, తండాలు నీటి ఎద్దడితో ‘దాహామో రామచంద్రా’ అంటూ తాగునీటి కోసం గోస పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి వనరులు అడుగంటిపోతున్నాయి.

భూగర్భజలాలతో పాటు కొండలకు సమీపాన ఉన్న వాగులు, చెరువుల్లోని  నీళ్లు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలోని గాదెగూడ, నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, కెరమెరి, లింగాపూర్, సిపూర్ (యు), బజర్‌హత్‌నూర్, బోత్, ఇచ్చోడ, శ్రీనికొండ, తిర్యాణి తదితర ప్రాతాల్లో  ఇప్పటికే నీటి కొరత ఏర్పడింది. కొన్ని గ్రామాలకు చెందిన మహిళలు, పురుషులు ఊళ్లకు దూరంగా ఉన్న వాగులు, చెరువుల వద్దకు కిలోమీటర్ల దూరం నడిచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. కొందరైతే ఎద్దుల బండ్లపై ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నీటిని తరలిస్తున్నారు. దీనికితోడు రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో వేడిగాలుల తాకిడి కూడా ఎక్కువైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కింద పలు గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తోంది. అయితే ఈ నీరు దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. పైప్‌లైన్లకు మరమ్మతులు అవసరం కావడమే దీనికి కారణం. తాగునీటి అవసరాల కోసం ప్రజలు బోరుబావులపై ఆధారపడుతున్నారు. వాషింగ్, క్లీనింగ్, ఇతర అవసరాలకు మిషన్ భగీరథను ఉపయోగించుకుంటున్నారు.

పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖలు గుర్తించిన గ్రామాలకు ట్యాంకర్లలో తాగునీటిని సరఫరా చేస్తూ తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. పాడుబడిన బావుల నుంచి సేకరించిన నీటిని తాగడం, అలాంటి నీటిని ఉపయోగించి ఆహారాన్ని వండటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురైన సందర్భాలు గతంలో చోటుచేసుకున్నాయి. ఈ విషయమై అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని గాదెగూడకు చెందిన వసంతరావు మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న అంతర్గత గ్రామాలకు మిషన్‌ భగీరథ కింద స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటే కొంతవరకైనా నీటి సమస్య తీరుతుందని వేడుకుంటున్నాడు.