తెలంగాణలో దారుణం జరిగింది. నవ మాసాలు మోసిన కన్న బిడ్డలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య (Suicide)కు పాల్పడిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య(Suicide) చేసుకోగా తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు కూతుళ్లు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెండడంతో ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారం ప్రకారం ఇచ్చోడ మండల కేంద్రంలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న ప్రశాంత్ రెడ్డి – వేదశ్రీ దంపతులకు 8 ఏళ్ల పెద్ద కూతురు ప్రజ్ఞ, 4 ఏళ్ళ చిన్న కూతురు వెన్నెలలు ఉన్నారు. ఇటీవల భర్త ప్రశాంత్ రెడ్డి అయ్యప్ప దీక్ష మాల ధరించారు.
Also Read: FMGE Scam : ఏపీ, తెలంగాణాల్లో విదేశీ మెడికల్ పరీక్ష కుంభకోణం
కాగా ఇంట్లో ఎవరూ లేని సమయం గమనించిన తల్లి వేదశ్రీ గురువారం తనపై, తన ఇద్దరు పిల్లలపై సైతం కిరోసిన్ పోసి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే తల్లి వేదశ్రీ ఘటన స్థలంలోని మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ మొదట పెద్ద కూతురు ప్రజ్ఞ మృతి చెందగా, కొద్దిసేపటికి చిన్న కూతురు వెన్నెల సైతం మృతి చెందింది. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో పెను విషాదాన్ని నింపింది. కాగా ఇచ్చోడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కొన్నాళ్లుగా అత్తింటి వారితో చిన్న గొడవలు రావటంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ దారుణం చేసినట్లు సమాచారం.