Site icon HashtagU Telugu

Minister Sridhar Babu: విద్యార్థుల విజయం టెక్నాలజీతోనే: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Minister Sridhar Babu

Minister Sridhar Babu

Minister Sridhar Babu: విద్యార్థులు జీవితంలో సక్సెస్ (విజయం) సాధించాలంటే తప్పనిసరిగా టెక్నాలజీలో మంచి ప్రావీణ్యం సంపాదించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) సూచించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల టి-సాట్ (T-SAT) కార్యాలయంలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ‘రాష్ట్ర స్థాయి వార్షిక పోటీలు-2025’ విజేతల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: మంత్రి

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సమాజంలో అత్యంత వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకోవాలని, తద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ప్రస్తుత కాలంలో విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని అంచనా వేయలేకపోతున్నామని, వారి మేధో సంపత్తికి టి-సాట్ సాంకేతికతను ఉపయోగించుకుని తమ భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకోవాలని సూచించారు.

Also Read: Sania Mirza: సానియా మీర్జాకు అరుదైన వ్యాధి.. అది ఏంటంటే?

విద్యార్థులు విజయం సాధిస్తే టీచర్లు, ఆ తర్వాత తల్లిదండ్రులు సంతోషిస్తారని, కేవలం చదువుల్లో మొదటి స్థానమే కాకుండా, ఇలాంటి పోటీల్లో పాల్గొనడం చాలా ముఖ్యం అని మంత్రి అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

టి-సాట్ పోటీల్లో విజేతలైన 99 మంది విద్యార్థులు, సుమారు 2,200 మంది విద్యార్థుల నాలెడ్జ్‌తో సమానం అని మంత్రి ప్రత్యేకంగా గుర్తు చేశారు. అందుకే తమ ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, డిజిటల్ విద్యలో టి-సాట్ అందిస్తున్న సాంకేతికతను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరియు మారుమూల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

99 మంది విద్యార్థులకు సన్మానం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘రాష్ట్ర స్థాయి వార్షిక పోటీలు 2025’ పేరుతో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు గురువారంతో ముగిశాయి. మండల, జిల్లా, జోనల్ స్థాయిలలో నిర్వహించిన ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వక్తృత్వ పోటీల్లో ప్రథమ విజేతగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థి కె.కేశవర్థన్ నిలిచారు. ద్వితీయ స్థానంలో మేడ్చల్ మల్కాజ్ గిరికి చెందిన కె.వి.యషశ్విని, తృతీయ స్థానంలో నిర్మల్ జిల్లాకు చెందిన వంగా వెంకటకృష్ణ నిలిచారు.

వ్యాస రచన పోటీల్లో ప్రథమ విజేతగా నిజామాబాద్ జిల్లాకు చెందిన టి.హర్షిత, ద్వితీయ విజేతగా నారాయణపేట జిల్లాకు చెందిన ఎం.కీర్తన, తృతీయ స్థానంలో మేడ్చల్ జిల్లాకు చెందిన డి.తేజస్విని గెలుపొందారు. క్విజ్ పోటీల్లో ఈ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జోన్ ప్రథమ విజేతగా, కాలేశ్వరం జోన్ ద్వితీయ విజేతగా, బాసర జోన్ మూడవ స్థానంలో నిలిచింది. జోగులాంబ గద్వాల జోన్ ప్రత్యేక విజేతగా నిలిచింది.

ఈ సందర్భంగా టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు టి-సాట్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని కొనియాడారు. విద్యార్థులు ప్రతి రోజూ కనీసం గంట పాటు టి-సాట్ నెట్‌వర్క్‌ను చూడాలని సూచించారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులందరికీ టి-సాట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్‌లను అందజేసి ప్రోత్సహించింది. తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, టి-సాట్ కార్యక్రమాలను విద్యార్థులకు అందించేందుకు తమ బాధ్యతను నిర్వర్తిస్తామని హామీ ఇచ్చారు.

Exit mobile version