KTR: నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత మొదలైంది: కేటీఆర్

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 08:01 PM IST

KTR: ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని భైంసాలో జరిగిన రోడ్ షో లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.  ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 5 నెలల కింద కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చారని, కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని అప్పుడు కేసీఆర్ గారు చెప్పారని, ఐదు నెలల్లో కాంగ్రెస్ పాలన ఎట్ల ఉందో చూశారు కదా? కరెంట్ కోతలు ఉన్నాయా? అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిండని, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ. 2500, పెద్దమనుషులకు రూ. 4 వేలు, తులం బంగారం, స్కూటీలు అని చెప్పిండని, రేవంత్ రెడ్డి చెప్పిన హామీల్లో ఒక్క హామీ అన్న అమలైందా? కేటీఆర్ ప్రశ్నించారు.

‘‘ఆత్రం సక్కు గారు సీనియర్ నాయకులు. ఆదివాసీల కోసం ఎంతో కృషి చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్లు 5 నెలల్లో చాలా హామీలిచ్చి మనల్ని మోసం చేశారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. పదేళ్ల క్రితం ఎన్నో డైలాగులు చెప్పి బీజేపీ వాళ్లు కూడా లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అని అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా. మీరు 13 తారీఖు నాడు సక్కు గారిని కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించండి’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.

‘‘మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం సరైన వ్యక్తులకు అవకాశం ఇవ్వలేకపోయాం. మన పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు పోనివ్వడి. చెత్తంతా పోతోంది. బీజేపీ వాళ్లు ఏమైనా అంటే నమో అంటారు. నమో అంటే నరేంద్రమోడీ కాదు నమ్మించి మోసం చేసే వ్యక్తి. పదేళ్లలో దేశానికి గాని ఆదిలాబాద్ కు గానీ ప్రధాని ఒక్క పనిచేయలే. ఆదిలాబాద్ లో సీసీఐ ను ఓపెన్ చేయలే. బీజేపీ ఎంపీ ముధోల్ తాలుకాలో ఒక్కటంటే ఒక్క పని చేయలే. 2014 మోడీ చాలా హామీలిచ్చిండు. రూ. 15 లక్షలు అందరి అకౌంట్లో వేస్తా అన్నాడు. రైతుల ఆదాయం డబుల్, అందరికీ ఇళ్లు, ఇంటింటికి నల్లా అని చాలా చెప్పాడు. కానీ చెప్పిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు’’ అని కేటీఆర్ అన్నారు.