Congress & BJP: పొలిటికల్ టూరిస్ట్ కేసీఆర్!

దేశవ్యాప్త పర్యటన కోసం ఢిల్లీ వెళ్లారు సీఎం కేసీఆర్. ఈ దఫా వారం రోజుల పాటు పలు రాష్ట్రాలకు వెళ్లనున్నారు.

  • Written By:
  • Updated On - May 21, 2022 / 12:53 PM IST

దేశవ్యాప్త పర్యటన కోసం ఢిల్లీ వెళ్లారు సీఎం కేసీఆర్. ఈ దఫా వారం రోజుల పాటు పలు రాష్ట్రాలకు వెళ్లనున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలు, ఆర్థిక రంగ నిపుణులతో భేటీ అవుతారు. జాతీయ మీడియా సంస్థలతోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు ప్లాన్ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై విమర్శలు హోరెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ, అమిత్ షా వచ్చినప్పుడు పొలిటికల్ టూరిస్టులు వచ్చారంటూ కామెంట్ చేసిన టీఆర్ఎస్ నేతలు.. సీఎం కేసీఆర్ విషయంలో ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పర్యటించడం, పలువురు రాజకీయ నాయకులను కలవడం దేని కిందకు వస్తుందో సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు కొందరు మంత్రులు.. రాహుల్ గాంధీ, అమిత్ షా పర్యటనలపై విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. పొలిటికల్ టూరిస్టులు వచ్చి పోతుంటారని ట్వీట్స్ చేశారు.

సీఎం కేసీఆర్ కూడా రాజకీయ ఎజెండాతోనే ఢిల్లీలో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి ఛండీఘర్, బెంగళూరు, మహారాష్ట్రకు వెళ్తున్నారు. దీంతో సీఎం చేస్తున్నది పొలిటికల్ టూరిజం కాదా అని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాహల్, షా తెలంగాణకు వస్తేనేమో పొలిటికల్ టూరిస్టులు.. అదే కేసీఆర్ వెళ్తే మాత్రం అర్ధవంతమైన రాజకీయమా అంటూ ప్రతివిమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి, ఇతర రాష్ట్రాలకు వెళ్తారని తెలిసి కూడా.. ఆ పార్టీ నేతలు ఆ వ్యాఖ్యలు చేయడం ముందుగా టీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పిదమని రాజకీయ విశ్లేషకులు కూడా  అభిప్రాయపడుతున్నారు.  ఎందుకు వస్తున్నారు, ఏం చేద్దామనుకుంటున్నారు అనే విషయాలపై సూటిగా ప్రశ్నిస్తే తప్పులేదు గాని.. అసలు తెలంగాణకు రావడాన్నే ప్రశ్నిస్తే మాత్రం రియాక్షన్ ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.