Site icon HashtagU Telugu

TSPSC Group-1: నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే.. గ్రూప్-1 ప‌రీక్ష‌ల‌కు టీఎస్‌పీఎస్‌సీ ప‌టిష్ఠ చ‌ర్య‌లు

TGPSC NEW UPDATE

గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల(Group 1 Exams) నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ(Telangana) హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో TSPSC (తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌) ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతుంది. ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డంతో గ‌తంలో జ‌ర‌గాల్సిన గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసిన విష‌యం విధిత‌మే. ఈ వ్య‌వ‌హారంలో విచార‌ణ జ‌రుగుతున్న క్ర‌మంలోనే తిరిగి జూన్ 11వ తేదీ ఆదివారం(Sunday) గ్రూప్-1 పరీక్షలు నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) నోటిఫికేష‌న్ జారీ చేసిన విష‌యం విధిత‌మే. అయితే, గ‌తంలో పేప‌ర్ లీక్‌(Paper Leak)కు కార‌ణ‌మైన సిబ్బందితోనే మ‌ళ్లీ గ్రూప్‌-1 నిర్వ‌హిస్తున్నార‌ని పిటిష‌న‌ర్లు తెలంగాణ హైకోర్టును(High Court) ఆశ్ర‌యించారు. కోర్టు విచార‌ణ అనంత‌రం సోమ‌వారం తీర్పును వెలువ‌రించింది. గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్‌సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో తొలుత నిర్ణ‌యించిన విధంగా జూన్ 11 గ్రూప్‌1 ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్‌సీ ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టింది.

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల‌కు మొత్తం 3 లక్షల 63 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 503 గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వాహణ జ‌ర‌గ‌నుంది. ఇప్పటికే అన్ని సెంటర్లలో టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వెబ్‌సైట్‌లో హల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. గతంలో జరిగిన కొన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జూన్ 11వ తేదీ ఆదివారం పరీక్ష ఉదయం 10.30 గంట‌ల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప‌రీక్ష జ‌రుగుతుంది. ప‌రీక్ష రాసే అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా నిబంధ‌న‌లు పాటించాల‌ని టీఎస్‌పీఎస్‌సీ స్ప‌ష్టం చేసింది. ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్ మూసివేస్తామని పేర్కొంది. ఉదయం 10 గంటల 15 నిమిషాల తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్‌ల‌లోకి అనుమతించేది లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

ఓఎంఆర్ షీట్ ను నింపే విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని, ఓఎంఆర్ షీట్ నింపే సమయంలో ఏమైనా మిస్టేక్ చేస్తే కొత్తది ఇచ్చే ప్రసక్తే లేద‌ని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే ఓఎంఆర్ షీట్లో ఆన్సర్లను బబ్లింగ్ చేయాలన్న కమిషన్ తెలిపింది. పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్లతో బబ్లింగ్ చేస్తే ఆ ఓఎంఆర్ షీట్లు చెల్లవని స్పష్టం చేసింది. డబుల్ బబ్లింగ్ చేస్తే కూడా అంగీకరించేది లేదని టీఎస్‌పీఎస్‌సీ వెల్ల‌డించింది. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఆధార్, పాన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వంటి ఫొటోలతో కూడిన ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులు తప్పనిసరి అని సూచించింది. ఎగ్జామ్ సెంటర్ లో పరీక్షలు రాసే అభ్యర్థులు ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రించింది. అంతేకాదు, భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామ‌ని కమిషన్ స్ప‌ష్టం చేసింది.

 

Also Read :  KCR Strategy: కేసీఆర్ మైండ్ గేమ్.. ప్రత్యర్థిని తేల్చేసిన గులాబీ బాస్!