Site icon HashtagU Telugu

Telangana Liberation Day : నిజాం నిరంకుశత్వం ఓడిన రోజు.. హైదరాబాద్ గడ్డ గెలిచిన రోజు

Telangana Liberation Day

Telangana Liberation Day

Telangana Liberation Day : ఇవాళ సెప్టెంబర్ 17 . ఈ రోజును తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటుంటే.. ఇంకొన్ని పార్టీలు తెలంగాణ విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. మరికొన్ని పార్టీలు తెలంగాణ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాయి. పేర్లు ఏవైనప్పటికీ.. చరిత్రను ఎవరూ మార్చలేరు. 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ లో జరిగిన ఒక కీలక ఘటనను దాన్ని అందరూ ఒకే విధంగా చూస్తారు.  ఆరోజున నిజాం నవాబు భారత సైన్యానికి లొంగిపోయాడు. దీంతో హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజలందరికీ స్వాతంత్ర్యం వచ్చింది. ఆనాటి హైదరాబాద్ సంస్థానం చాలా పెద్దది. అందులో మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన ఔరంగాబాద్, నాందేడ్, పర్బనీ, బీడ్, గుల్బర్గా, బీదర్, ఉస్మానాబాద్, రాయచూర్ సిటీలు కూడా భాగంగా ఉండేవి. నిజాం నవాబు లొంగుబాటు తర్వాత హైదరాబాద్ మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అందుకే సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం.

Also read : Financial Deadlines: సెప్టెంబర్ 30న ముగిసే ఐదు ముఖ్యమైన ఆర్థిక పనుల జాబితా ఇదే..!

13 నెలలు ఆలస్యంగా స్వాతంత్ర్యం

వాస్తవానికి 1947 ఆగస్టు 15నే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.  కానీ దాదాపు ఏడాది ఆలస్యంగా హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం లభించింది.  ఆ సమయంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ పాలన కారణంగా హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు స్వాతంత్య్రం కోసం మరో 13 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో జరిగిన “ఆపరేషన్ పోలో” ద్వారా నిర్వహించిన పోలీసు యాక్షన్ తో హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం నవాబు నుంచి విముక్తి లభించింది. సెప్టెంబరు 17న నిజాం నవాబు నుంచి లభించిన విమోచనను గుర్తు చేసుకుంటూ.. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ‘‘మరాఠ్వాడా ముక్తి సంగ్రామ్ దివస్’’గా , కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ‘‘హైదరాబాద్-కర్ణాటక విమోచన దినోత్సవం’’గా సెలబ్రేట్ చేసుకుంటారు. సెప్టెంబరు 17 వేళ నిజాం నవాబుపై అలుపెరుగని పోరాటం చేసిన పలువురు మహనీయులను తెలంగాణ సమాజం స్మరించుకుంటుంది. ఈ జాబితాలో స్వామి రామానంద తీర్థ, పిహెచ్ పట్వర్ధన్, గోవిందబాయ్ ష్రాఫ్, విజయంత్ర కబ్ర, కొమురం భీమ్, షోయబుల్లా ఖాన్, వందేమాతరం రామచందర్ రావు, నారాయణరావు పవార్, చాకలి ఐలమ్మ వంటి వారు ఎందరో ఉన్నారు.

హైదరాబాద్ స్వతంత్ర రాజ్యమన్నాడు..

చరిత్రలోకి వెళితే..మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్ననిజాం నవాబు ఉండేవాడు. 1947 ఆగస్టు 15న భారత్ కు స్వాతంత్య్రం సిద్ధించగా, నిజాం నవాబుకు రైట్ హ్యాండ్ గా మెలిగిన రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీ హైదరాబాద్ ను ప్రత్యేక దేశంగా ప్రకటిస్తామని చెప్పాడు.నిజాంకు ఉన్న 24,000 సైన్యానికి అదనంగా 1,50,000 మంది రజాకార్లను అందించి మద్దతు తెలిపాడు. తమది స్వతంత్ర రాజ్యమని, హైదరాబాద్ అటు భారత్ లో, ఇటు పాకిస్థాన్ లో కలవదని నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వెల్లడించాడు. కానీ హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. దీంతో నిజాం నవాబు ఆదేశాలను అమలు చేస్తూ.. సంస్థానంలోని ప్రజలను అణచివేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారి ఆస్తులను కొల్లగొట్టి, గ్రామాలపై దాడులకు తెగబడ్డారు. నిజాం నిరంకుశ పాలనపై పోరాడుతున్న స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ లపై ఉస్మాన్ అలీఖాన్ బ్యాన్  విధించాడు. నిజాం నవాబుతో చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకొందామని భారత తొలి ప్రధాని నెహ్రూ అనుకొన్నారు. కానీ హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్థాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. ఈక్రమంలో 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ‘ఆపరేషన్ పోలో’ పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి ‘పోలీస్ యాక్షన్’ అనే పేరు పెట్టారు.  ఆ సైనిక చర్య కేవలం 5 రోజుల్లోనే ముగిసిపోయింది. భారతసేనల ధాటికి తట్టుకోలేక నిజాం నవాబు లొంగిపోతున్నట్లు (Telangana Liberation Day) ప్రకటించాడు.