Site icon HashtagU Telugu

CM KCR : కేసీఆర్ ‘స‌హార‌, ఈఎస్ఐ స్కామ్ క‌హానీ

Kcr Bandi Amit Shah

Kcr Bandi Amit Shah

తెలంగాణ సీఎం కేసీఆర్ ను స‌హారా, ఈఎస్ ఐ స్కామ్ లు వెంటాడుతున్నాయి. ప్ర‌స్తుతం ఆ రెండు కుంభకోణాల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను సీబీఐ అధ్య‌య‌నం చేస్తోంది. ఆ విష‌యాన్ని బీపీపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చెబుతున్నారు. అంతేకాదు, కేసీఆర్ ను ఎప్పుడు అరెస్ట్ చేయాలో కేంద్రానికి బాగా తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఆర్టీఐ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కొంద‌రు మాత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అక్ర‌మాలు, అవినీతిపై ఉద్య‌మానికి దిగారు. ఆ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ, సీఎం కేసీఆర్ అరెస్ట్ ఖాయ‌మ‌ని మ‌రోసారి వెల్ల‌డించ‌డం రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది.

‘కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చు. అతన్ని ఎప్పుడు జైలుకు పంపాలనే దానిపై మాకు వ్యూహం ఉంది. ” అంటూ మ‌రోసారి బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సహారా, ఈఎస్‌ఐ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలను ద‌ర్యాప్తు సంస్థలు గత 10 రోజుల నుంచి పరిశీలిస్తున్నట్లు సంజయ్ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై కూడా తమ లీగల్‌ టీమ్‌ విచారణ చేస్తోందని తెలిపారు. వారి అధికార పరిధిలో భూ ఆక్రమణలు మరియు సెటిల్‌మెంట్లు వంటి సమస్యలలో ఈ వ్యక్తుల ప్రమేయంపై ఇది RTI పిటిషన్లను దాఖలు చేసింది.

కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణ కాంట్రాక్టు ఇవ్వడంలో అక్ర‌మాలు జరిగాయన్న ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు కాకుండా ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు కాంట్రాక్ట్‌ను అప్పగించడంపై అప్ప‌ట్లో కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 2006లో ఆ కాంట్రాక్టు ఇచ్చారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ESIC) 2007-2008లో నాసిరకం పని నాణ్యతపై విచారణ ప్రారంభించింది. ఆ సంస్థ ఇచ్చిన ఆధారాల ద్వారా సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూర్యనారాయణ పేరును కూడా ఆ కేసులో నమోదు చేసింది. కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీ, అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఈఎస్‌ఐ, అప్పటి కంట్రోలర్ ఆఫ్ ఫైనాన్స్‌లను సీబీఐ ఇప్పటివరకు విచారించింది. సీబీఐ నివేదిక ప్రకారం, కేసీఆర్ 2005-06లో మంత్రిగా ఉన్నప్పుడు పీఎఫ్ అథారిటీని కాద‌ని ఐదు సహారా గ్రూప్ కంపెనీలు సొంతంగా ఖాతాల‌ను నిర్వ‌హించుకోవ‌డానికి కేసీఆర్ అనుమతి ఇచ్చారని నివేదించబడింది. ఇది పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం, ఉద్యోగుల ప్రయోజనాలకు కూడా విరుద్ధం కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ పై ఉన్న కేసును మ‌రోసారి ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

సహారా డిపాజిట్లపై వివాదం కార‌ణంగా సహారా గ్రూప్ చైర్మన్ ఏడాది కాలంగా జైలులో ఉన్నారు. ఇప్పుడు పీఎఫ్ సమస్యపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఫ‌లితంగా కేసీఆర్ త్వ‌ర‌లో ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌తికూల‌త‌ను ఎదుర్కోబోతున్నార‌ని బీజేపీ చెబుతోంది. ఆ క్ర‌మంలో ఇటీవల హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కేసీఆర్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. స‌హారా గ్రూప్ 11 లక్షల మంది ఉద్యోగులను, కేంద్ర ప్రభుత్వాన్ని రూ. 7,000 కోట్ల మేర మోసం చేసిందని ఈపీఎఫ్‌వో విచారణలో తేలింది. 2006లో యూపీఏ హయాంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నందున అక్రమాలకు సంబంధించి కేసీఆర్‌ను 2015 అక్టోబర్‌లో సీబీఐ ప్రశ్నించింది. హైదరాబాద్, వైజాగ్ మరియు చెన్నై నగరాల్లో ESI ఆసుపత్రుల నిర్మాణం మరియు నిర్వహణకు సంబంధించిన అంశంతో ముడిప‌డి ఉంది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ESIC) 2007-2008లో నాసిరకమైన పని నాణ్యతపై విచారణ చేసి CBI దర్యాప్తు ప్రారంభించింది. రూ.19 కోట్లకు కాంట్రాక్టు కుదిరినప్పటికి నాణ్యత లోపించిన కార‌ణంగా రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.

ఈఎస్‌ఐ భవన నిర్మాణం, సహారా పీఎఫ్‌ కుంభకోణంలో కోట్లాది రూపాయలను స్వాహా చేశారని పీపుల్స్‌ఫ్రంట్ ప్రకటన చేసింది. ఈఎస్‌ఐ కుంభకోణానికి సంబంధించి సిబిఐ ఛార్జ్‌షీట్‌లో కెసిఆర్ పేరును తొలగించిందని ఆరోపించింది. టెండర్ల ఖరారు నిబంధనలను ఉల్లంఘించి నామినేషన్‌ పద్ధతిలో పనులు ఇప్పిస్తామంటూ కేసీఆర్‌ కమీషన్లు తీసుకున్నారని కాంట్రాక్టర్‌ వి సత్యనారాయణ ఆరోపించారు. సహారా కుంభకోణం వెనుక కేసీఆర్ హస్తం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. కంటి చికిత్స సాకుతో కేసీఆర్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేసుల నుంచి కాపాడాలని మోదీని వేడుకున్నార‌ని ఆరోపించారు.

ఎన్డీయే ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత సీబీఐ నివేదిక నుంచి కేసీఆర్ పేరును తొల‌గించార‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. యూపీఏ కేసు న‌మోదు చేస్తే, మోడీ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీయే కేసీఆర్ ను కాపాడింద‌ని చెబుతోంది. త్వ‌ర‌లోనే కేసీఆర్ జైలుకు వెళ‌తాడ‌ని బీజేపీ చెబుతోంది. ట‌చ్ చేసి చూడండ‌ని టీఆర్ఎస్ స‌వాల్ చేస్తోంది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఎవ‌రిది నిజ‌మో తెలియ‌ని గంద‌రగోళం నెల‌కొంది.