MNJ Cancer Hospital : ‘మెహదీ నవాజ్ జంగ్’ (ఎంఎన్‌జే).. నిజాం నవాబు కాలానికి చెందిన ఒక బ్యూరోక్రాట్. ఆయన పేరు మీదే హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ (MNJ Cancer Hospital) ఏర్పాటైంది. ఏటా ఎంతోమంది క్యాన్సర్ రోగులు ఈ ఆస్పత్రిలో ఉచిత చికిత్సను పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలయ్యే ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఫ్రీగా జరుగుతుంటుంది. అయితేే పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వైద్య సిబ్బంది సంఖ్యను, పడకల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. రేడియేషన్ థెరపీ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ)తో పనిచేసే ఒక అధునాతన యంత్రాన్ని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేశారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దాదాపు రూ.30 కోట్ల నిధులను ఖర్చు చేశారు. తదుపరిగా ఇలాంటి మరో రెండు యంత్రాలను ఏర్పాటు చేయించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. త్వరలోనే తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దీన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ తరహా యంత్రాలతో క్యాన్సర్ రోగులు రేడియేషన్ చికిత్స చేయించుకుంటే.. సగటున రూ.3 లక్షల దాకా ఖర్చవుతోంది.
Also Read :Trump Vs Putin : పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపాలని సూచన
ఏఐ రేడియేషన్ థెరపీ ప్రత్యేకతలివీ..
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ అధునాతన రేడియేషన్ థెరపీ యంత్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో ప్రస్తుతమున్న మూడు పాత యంత్రాలతో రేడియేషన్ సన్నాహక ప్రక్రియ కోసం ఒక్కో రోగికి 10 నిమిషాల టైం పడుతోంది. కొత్త యంత్రంతో 2 నిమిషాల్లోనే రేడియేషన్ సన్నాహక ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. పాత యంత్రాలతో రేడియేషన్ చికిత్స చేసే క్రమంలో రోగి కదిలితే.. చికిత్సలో నాణ్యత దెబ్బతింటుంది. కొత్త రేడియేషన్ యంత్రంలో ఇలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ప్రస్తుతం ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్న అన్ని యంత్రాలతో ప్రతిరోజు సగటున 350 మందికి రేడియేషన్ థెరపీ చేస్తుండగా.. కొత్తగా వచ్చిన ఒక్క యంత్రంతోనే రోజుకు 200 మందికి థెరపీ చేయొచ్చు. దీనివల్ల రోగుల వెయిటింగ్ పీరియడ్ తగ్గిపోతుంది. కొత్త రేడియేషన్ థెరపీ యంత్రంలో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో.. తొలి విడత థెరపీలోనే క్యాన్సర్ కణితి ఉన్న ప్రదేశాన్ని గుర్తిస్తారు. ఈ యంత్రంలో నిక్షిప్తమయ్యే సమాచారం తదుపరిగా చేసే చికిత్సల్లో కూడా ఉపయోగపడుతుంది.