Site icon HashtagU Telugu

SSC Hindi Leaked: తెలంగాణలో లీకుల పర్వం.. టెన్త్ హిందీ పేపర్ సైతం లీక్!

Hindi

Hindi

ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ ఘటన మరువకముందే తాజాగా టెన్త్ ప్రశ్నాపత్రాలు సైతం లీక్ అవుతుండటంతో తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నిన్న సోమవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే పరీక్ష మొదలైన కేవలం 7 నిమిషాల్ల్లోనే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ చక్కర్లు కొట్టడం అందర్నీ షాక్ కు గురిచేసింది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో తాజాగా మంగళవారం హిందీ పేపర్ సైతం లీక్ కావడం సంచలనం రేపుతోంది.

వరంగల్ జిల్లాలో 9.30 గంటలకు హిందీ పేపర్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే పరీక్షకు ముందే పేపర్ లీక్ అయ్యిందా.. పరీక్ష మొదలైన అరగంట తర్వాత ఎవరైనా లీక్ చేశారనే విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే వరుస ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇక ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి.

కాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో పదవ తరగతి ఆన్సర్‌షీట్‌ల కట్ట మిస్‌ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకెళ్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాదాపు ఇరవై మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.