Srushti Case : వైద్య రంగాన్ని కుదిపేసిన ‘సృష్టి’ ఫెర్టిలిటీ కుంభకోణం కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు, తాజా మలుపుగా విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు చెందిన ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు. గోపాలపురం పోలీసులు అరెస్టు చేసిన వారిలో అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ వాసుపల్లి రవికుమార్, ప్రసూతి విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషాదేవి ఉన్నారు.
డాక్టర్ వాసుపల్లి రవికుమార్ మాజీ ఎమ్మెల్యే తమ్ముడవడంతో ఈ కేసులో రాజకీయ కోణం మరోసారి ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన డాక్టర్ విద్యుల్లత కూడా కేజీహెచ్‌లోనే పనిచేసినట్లు సమాచారం. ఈ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూనే, ప్రైవేటు ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేంద్రంలో సేవలు అందించారన్న ఆరోపణలు బయటకొస్తున్నాయి.
కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఈ అరెస్టులపై స్పందిస్తూ… ‘‘మాకు ఎలాంటి సమాచారం తెలియదు’’ అని తెలిపారు. కాగా, డాక్టర్ వాసుపల్లి రవికుమార్ గత మూడు రోజులుగా సెలవులో ఉన్నారని తెలుస్తోంది.
Gold Price Today : ఈరోజు బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సంబంధాలున్న డాక్టర్ రమ్య, డాక్టర్ రవి అనే ఇద్దరు వైద్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య 28కు చేరింది.
దర్యాప్తులో వెల్లడైన షాకింగ్ వివరాల ప్రకారం, డాక్టర్ నమ్రత సరోగసి పేరిట సుమారు 50 మంది బాధితుల వద్ద నుంచి రూ.20 కోట్లకు పైగా వసూలు చేశారు. మరో కీలక నిందితురాలు సంతోషి అనే మహిళ ఏజెంట్ల సహకంతో 18 మంది శిశువులను సేకరించినట్లు తెలిసింది.
ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు చెందిన పేద మహిళలను లక్ష్యంగా చేసుకొని, వారిని ప్రలోభ పెట్టి శిశువులను రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. తర్వాత అదే శిశువులను కస్టమర్లకు ఒక్కో దానికి రూ.50 లక్షల వరకూ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 80 మంది శిశువుల అక్రమ అమ్మకాలు జరిగినట్లు ఆధారాలు లభించాయి.
ప్రస్తుతం డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇక బాధిత తల్లులను గుర్తించి, వారి పిల్లలను తిరిగి అప్పగించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ కేసు మరిన్ని తీవ్ర విషయాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉండటంతో వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Car Driving Tips: కొత్తగా కారు డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!