Srushti Fertility Scam : హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వస్తున్న సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసు రోజురోజుకీ మరింత సంచలనంగా మారుతోంది. ఈ ఘోర మోసానికి కేంద్ర బిందువుగా ఉన్న డాక్టర్ నమ్రతపై దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్లు, బినామీ ఖాతాలు, ఆస్తులపై పెద్ద ఎత్తున విచారణకు సిద్ధమవుతున్నాయి.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో అక్రమ సరోగసీ, ఐవీఎఫ్ పద్ధతుల్లో శిశువుల అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నెట్‌వర్క్ కేవలం హైదరాబాద్ లేదా రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల వరకు విస్తరించిందని అనుమానాలు ఉన్నాయి.
Shri Shakti scheme : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్ పోలీసులు గుర్తించిన వివరాలు నిజంగా షాకింగ్. శిశువులను “చేతులు మారే” ప్రక్రియలో ఒక్కో బిడ్డకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆధారాలు దొరికాయి. సెంటర్‌లో డిజిటల్, నగదు రూపాల్లో జరిగిన లావాదేవీలన్నీ రివ్యూ చేస్తున్నారు. డాక్టర్ నమ్రత అక్రమ కార్యకలాపాలకు సహకరించిన బ్యాంక్ ఖాతాలపై కూడా నిఘా పెట్టారు.
డాక్టర్ నమ్రతతో పాటు సృష్టి పేరుతో నడిచిన బ్యాంక్ అకౌంట్లలో 2019 నుంచి 2025 వరకు భారీ మొత్తంలో నగదు జమ అయినట్లు దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ సొమ్మును త్వరలోనే ఫ్రీజ్ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సరోగసీ పేరుతో మోసపోయిన బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటివరకు రాజస్థాన్‌కు చెందిన దంపతులతో పాటు, నల్లగొండకు చెందిన జంట నుంచి రూ.11 లక్షలు, ఓ ఎన్ఆర్ఐ నుంచి రూ.19 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన జంట నుంచి రూ.16 లక్షలు, మరో జంట నుంచి రూ.12.5 లక్షలు డాక్టర్ నమ్రత వసూలు చేసినట్లు దర్యాప్తు అధికారులు ధృవీకరించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలపై కచ్చితమైన ఆధారాలు సేకరిస్తోంది. అక్రమ సరోగసీ గ్యాంగ్ నెట్‌వర్క్ మొత్తం కూలగొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన వివరాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Stray Dogs : ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడదపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం