శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 50 మంది కార్మికులు లోపల పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో 42 మంది సురక్షితంగా బయటపడగా, మిగతా 8 మంది లోపల చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు జోరుగా కొనసాగుతున్నప్పటికీ, టన్నెల్‌లో బురద, మట్టిపెళ్లలు, నీటి నిల్వలు భారీగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర అంతరాయంగా మారింది. NDRF బృందాలు, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, లోతైన మట్టిపెళ్లల కారణంగా వెనక్కి వచ్చేశాయి. దీంతో ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రత్యేకమైన వ్యూహంతో ముమ్మర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Bird Flu : ఘోరంగా పడిపోయిన చికెన్ అమ్మకాలు..
ఈ ప్రమాదానికి ప్రాథమికంగా పాత పనులను తిరిగి ప్రారంభించడంలో తీసుకున్న నిర్లక్ష్యమే కారణమని నిపుణులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా నిలిచిపోయిన టన్నెల్ పనులను విస్తృతమైన భద్రతా పరిశీలన లేకుండానే పునరుద్ధరించారని తెలుస్తోంది. సాధారణంగా ఈ తరహా భూగర్భ నిర్మాణ పనులను ప్రారంభించేటప్పుడు భూస్కలనం, నీటి లీకేజీ, గాలి ప్రసరణ వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోవాలి. కానీ ఇక్కడ అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే పనులు మొదలైన నాలుగు రోజుల్లోనే ప్రమాదం సంభవించిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
God Chip : ప్రపంచాన్ని మార్చేసే ‘గాడ్ చిప్’.. ఏం చేస్తుందో తెలుసా ?
టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలను కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీరిలో ప్రాజెక్ట్ ఇంజినీర్లు మనోజ్ కుమార్, శ్రీనివాస్ (ఉత్తరప్రదేశ్) కు చెందినవారు కాగా, మిగతా ఆరుగురు కార్మికులు జార్ఖండ్, జమ్మూ-కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారు. వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం గవర్నర్, ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, లోపల పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిన నేపథ్యంలో, వీరిని ప్రాణాలతో కాపాడే అవకాశాలు తగ్గుతున్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదం పునరావృతం కాకుండా భవిష్యత్తులో నిర్మాణ ప్రణాళికలను మరింత భద్రతా ప్రమాణాలతో అమలు చేయాలన్న అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.