Modi @TS: ప్రధాని బస చేయాలంటే ఎస్పీజీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసా? 25 వేల మంది పోలీస్ సిబ్బందితో పహారా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడికి వెళ్లినా అక్కడ బస చేయాలంటే చాలా సెక్యూరిటీ అంశాలు చూడాలి.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 08:45 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడికి వెళ్లినా అక్కడ బస చేయాలంటే చాలా సెక్యూరిటీ అంశాలు చూడాలి. అలాంటిది.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ లో రెండు రోజుల పాటు ఉండనున్నారు. దీంతో రాజ్ భవన్ లో బస చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళ సై ఇప్పటికే ప్రధానిని కోరారు. కానీ దానిపై ఇంకా అటువైపు నుంచి సమాధానం రాలేదు. ఎందుకంటే ప్రధాని ఎక్కడ ఉండాలి అన్నదానిపై ముందు ఆయన సెక్యూరిటీని చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్-ఎస్పీజీ క్లియరెన్స్ ఇవ్వాల్సిందే. అలా ఇవ్వాలంటే ఎస్పీజీ చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోదీతోపాటు సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా, బీజేపీ పాలిత 18 రాష్ట్రాల సీఎంలు కూడా వస్తారు. కాకపోతే వారంతా వివిధ హోటళ్లలో బస చేస్తారు. ఇక ప్రధాని రాజ్ భవన్ లోనే ఉండాలనుకుంటే.. అక్కడ భద్రతాంశాలను ఎస్పీజీ పరిశీలిస్తోందని సమాచారం. ఎందుకంటే రాజ్ భవన్ చుట్టూ ఎత్తయిన బిల్డింగులు ఉన్నాయి. మరికొన్ని నిర్మాణమవుతున్నాయి. వాటిపై నుంచి చూస్తే.. గెస్ట్ హౌస్ కనిపిస్తుందని.. అందుకే అక్కడి సెక్యూరిటీ విషయాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తోందని సమాచారం.

ఒకవేళ ప్రధాని కాని రాజ్ భవన్ లోనే ఉండాలనుకుంటే.. అక్కడ చుట్టుపక్కల ఉండే భవనాల్లో నిర్మాణ కార్మికులు ఉండకుండా చర్యలు తీసుకుంటారు. రాజ్ భవన్ తో పాటు పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలు, చుట్టూ ఉన్న అపార్ట్ మెంట్లపై రూఫ్ టాప్ వాచ్ ను ఏర్పాటుచేస్తారు. వీరితోపాటు ఫుట్ పెట్రోలింగ్ టీమ్స్ కూడా 24 గంటలూ పహారా కాస్తాయి. ప్రధాని మోదీ ఢిల్లీలో తన నివాసం నుంచి బయలుదేరింది మొదలు.. మళ్లీ ఢిల్లీ వెళ్లేవరకు.. సమావేశాలు జరిగే ప్రదేశంతోపాటు ఆ మీటింగ్స్ కోసం వచ్చినవారంతా రాకపోకలు సాగించే మార్గాలు, వారు బస చేసే ప్రాంతాలు.. ఇలా అన్నింటీకీ, అందరికీ సెక్యూరిటీని ఇవ్వడానికి దాదాపు 25 వేల మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించబోతున్నారు. రోజూ మూడు షిఫ్టుల్లో వీళ్లు భద్రతను కల్పించాల్సి ఉంటుంది.

ప్రధాని రాజ్ భవన్ లోనే విడిది ఉంటే.. అక్కడి నుంచి హెచ్ఐసీసీకి, పరేడ్ గ్రౌండ్స్ కి వెళ్లి రావాల్సి ఉంటుంది. కానీ అలా ఆయన వెళ్లి వచ్చే మార్గం అంతా ఆ సమయంలో ఫుల్ ట్రాఫిక్ తో ఉంటుంది. కానీ ప్రధాని ఆ మార్గంలో ప్రయాణించాలంటే.. కచ్చితంగా ఆ ట్రాఫిక్ ని ఆపి.. గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేయాల్సిందే. ప్రధాని వెళ్లే మార్గంలో రెండువైపుల రూట్లలోనూ ట్రాఫిక్ ను ఆపాల్సి ఉంటుంది. అలా అయితేనే ఎస్పీజీ రూట్ క్లియరెన్స్ ఇస్తుంది. సికింద్రాబాద్-గచ్చిబౌలి రూట్ లో మామూలు రోజుల్లోనే ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది. అలాంటిది ప్రధాని వెళ్లే మార్గంలో రూట్ ని క్లియర్ చేయాలంటే మాటలు కాదు. అందుకే ప్రత్యామ్నాయంగా ఇంకా ఏఏ మార్గాల్లో వెళ్లడానికి అవకాశం ఉందో ఇప్పటికే అధికారులు ప్లాన్ తయారుచేస్తున్నారు.