Telangana Congress Party: కాంగ్రెస్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా

ఢిల్లీ టూ హైద‌రాబాద్ వ‌యా మునుగోడు రాజ‌కీయం మ‌లుపులు తిరుగుతోంది.

  • Written By:
  • Updated On - August 5, 2022 / 06:17 PM IST

ఢిల్లీ టూ హైద‌రాబాద్ వ‌యా మునుగోడు రాజ‌కీయం మ‌లుపులు తిరుగుతోంది. నిమిషాల వ్య‌వ‌ధిలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ హ‌స్తిన వేదిక‌గా మీడియా ముందుకొచ్చారు. అదే స‌మ‌యంలో దాసోజు శ్ర‌వ‌ణ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని హైద‌రాబాద్ కేంద్రంగా మీడియా ఎదుట నిలిచారు. ఇంకో వైపు మునుగోడు అడ్డాగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మ‌క స‌మావేశాన్ని పెట్టారు. ఆ స‌మావేశం నల్గొండ కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చేసింది. కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షాను ఒకేరోజు కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ వేర్వేరుగా క‌లిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాల‌పై విన‌తి ప‌త్రాల‌ను ఇచ్చాన‌ని మీడియాకు వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ ఆరు లేన్ల రోడ్డు కోసం అమిత్ షాతో భేటీ అయ్యాయ‌ని చెప్పారు. అంతేకాదు, వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాల‌ని కోరాన‌ని చెబుతూ మునుగోడు రేవంత్ రెడ్డి స‌మావేశంపై ఫైర్ అయ్యారు. స్థానిక ఎంపీగా ఉన్న త‌న‌కు మాట‌మాత్రం చెప్ప‌కుండా ఎందుకు మీటింగ్ పెట్టార‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు, హుజూరాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా దండోరా స‌భ‌లు తెలంగాణ వ్యాప్తంగా పెట్టిన ఆయ‌న ఎందుకు హుజురాబాద్ మీద దృష్టి పెట్ట‌లేద‌ని నిల‌దీశారు. బీజేపీకి ప‌రోక్షంగా స‌హ‌కారం అందించ‌డానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో దొంగాట ఆడార‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు మునుగోడుకు ఎవ‌రి అనుమ‌తి తీసుకుని వెళ్లార‌ని నిల‌దీస్తున్నారు. వెధ‌వ ప‌నులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్నార‌ని ఎండ‌గ‌ట్టారు. దాదాపుగా ఇదే రేంజ్ లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కూడా అమిత్ షాను క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత రేవంత్ రెడ్డి పై మండిప‌డ్డారు. చిల్ల‌రదొంగ‌కు పీసీసీ అధ్య‌క్ష. ప‌ద‌వి ఇచ్చార‌ని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో రాబోవు రోజుల్లో వెంక‌ట‌రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచ‌న చేయాల‌ని సూచించ‌డం సంచ‌ల‌నం కలిగిస్తోంది. 90శాతం కాంగ్రెస్ ఖాళీ కానుంద‌ని చెప్ప‌డం ఆ పార్టీలో క‌ల‌క‌లం బ‌య‌లు దేరింది. మునుగోడు కేంద్రంగా చెరుకు సుధాక‌ర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవ‌డాన్ని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ముక్త‌కంఠంతో వ్య‌తిరేకించారు. ఇదే స‌మ‌యంలో దాసోజు శ్ర‌వ‌ణ్ రాజీనామా వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీలో క‌ల్లోలం రేపుతోంది. ఆయ‌న జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి హోదాలో రేవంత్ రెడ్డి పోక‌డ మీద విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న్ను బుజ్జ‌గించిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీని వీడ‌డానికి సిద్ధం అయ్యారు.

మునుగోడు స‌భ‌కు రేవంత్ రెడ్డికి తోడుగా ఉత్త‌మ్, జానా రెడ్డి నిల‌వ‌డం హాట్ టాపిక్ అయింది. ఆ స‌భ మునుగోడు ప్ర‌జ‌ల మ‌న‌సును గెలుచుకుంటుంద‌ని రేవంత్ అభిమానులు భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా అధికారికంగా ఇవ్వ‌న‌ప్ప‌టికీ హడావుడి మాత్రం ఊపందుకుంది. ఈనెల 8వ తేదీ స్పీక‌ర్ ఫార్మాట్ లో రాజీనామా అందించ‌బోతున్నారు. ఈనెల 21న అమిత్ షా స‌మ‌క్షంలో రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీ గూటికి చేర‌బోతున్నారు. ఆ రోజు ఆయ‌న‌తో పాటు ప‌లువురు చేరే అవ‌కాశం ఉన్నందున మునుగోడుకు అమిత్ షా వ‌స్తార‌ని రాజ‌గోపాల్ రెడ్డి చెబుతోన్నారు. మునుగోడు కాంగ్రెస్ స‌భ‌కు పోటీగా 21న బీజేపీ స‌భ పెట్ట‌నుంది. ఆ స‌భ‌లోనే బ‌లం నిరూపించ‌డానికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సిద్ధం అవుతున్నారు. ఆయ‌న‌తో పాటు ఎంద‌రు కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారో చూడాలి.