MP Santosh & CM KCR : ఒక ఫోటో..ఎన్నో ఊహ‌లు.!

ఒక ఫోటో వంద వార్త‌ల‌కు స‌మానమంటారు ర‌చ‌యితలు. రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రైనా ఒక ట్వీట్ చేశారంటే దాని వెనుక ఎన్నో అర్థాలు..ప‌ర‌మార్థాలు ఉంటాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తుంటారు.

  • Written By:
  • Updated On - December 10, 2021 / 03:54 PM IST

ఒక ఫోటో వంద వార్త‌ల‌కు స‌మానమంటారు ర‌చ‌యితలు. రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రైనా ఒక ట్వీట్ చేశారంటే దాని వెనుక ఎన్నో అర్థాలు..ప‌ర‌మార్థాలు ఉంటాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తుంటారు. తాజాగా ట్విట్ట‌ర్లో వైర‌ల్ అయిన ఎంపీ సంతోష్ కుమార్ , కేసీఆర్ క‌లిసి ఉన్న ఫోటో ఎన్నో భావాల‌ను తెలియ‌చేస్తోంది. తెలంగాణ రాజ‌కీయ ప‌రిణామాల‌కు ఆ ఫోటోను అన్వ‌యించుకుంటే ఎన్నో ఆలోచ‌న‌ల‌ను రేకెత్తిస్తోంది. రాజ‌కీయాల‌కు అతీతంగా ఆలోచిస్తే..సంతోష్ మీద కేసీఆర్ కు ఉన్న ప్రేమ‌ను ఆ ఫోటో రూడీ చేస్తోంది.టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా కేసీఆర్ భుజాల మీద ఆయ‌న ఉన్న ఫోటో ట్విట్ట‌ర్లో వైర‌ల్ అయింది. అనేక మంది అభిమానులు ఆ ఫోటోపై కామెంట్లు చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. కానీ, ఆ ఫోటో ట్వీట్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు మ‌రో కోణం నుంచి చూస్తున్నారు. కుటుంబ సంబంధం కోణం నుంచి సామాన్యులు చూస్తున్నారు. కేసీఆర్‌, సంతోష్ మ‌ధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కానీ,పార్టీలోని కొంద‌రు పొలిటిక‌ల్ కోణాన్ని బ‌య‌ట‌కు తీస్తున్నారు.

 

కేటీఆర్ కు స‌మాంత‌రంగా సంతోష్ రాజ‌కీయంగా ఎదుగుతున్నాడ‌ని ఆ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం కేసీఆర్ మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌గా ఉండే వాళ్ల‌లో సంతోష్ ముందు వ‌ర‌సలో ఉంటాడ‌ని గులాబీ శ్రేణులు అనుకుంటుంటారు. ఏడాది క్రితం క‌రోనా సోకిన‌ప్పుడు కేసీఆర్ ఆస్ప‌త్రికి వెళ్లిన సంద‌ర్భంగా ఒక వైపు కేటీఆర్ ఇంకో వైపు సంతోష్ ఫోటోలో క‌నిపించారు. ఈ ఫోటోను గులాబీ శ్రేణులు గుర్తుపెట్టుకున్నారు. ఈ ఫోటోను తాజాగా ట్విట్ట‌ర్లో వైర‌ల్ అయిన‌ ఫోటోను బేరీజు వేస్తూ కాబోయే సీఎంగా కేటీఆర్ మిగిలిపోతార‌ని సెటైర్లు వేసుకోవ‌డం వినిపిస్తోంది.హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కేసీఆర్ ఢిల్లీ వైపు చూస్తున్నాడు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను బ‌లోపేతం చేయాల‌ని భావిస్తున్నాడు. ఇటీవ‌ల ఢిల్లీ టూర్ల‌ను గ‌మ‌నిస్తే, నెల రోజుల పాటు అక్క‌డే ఒకానొక సంద‌ర్భంలో ఉన్నాడు. వారం రోజుల పాటు దేశ రాజ‌ధానిలో మ‌రో సంద‌ర్భంలో ఉన్నాడు. మూడు రోజుల పాటు ఇటీవ‌ల హ‌స్తిన‌లో ఉండి వ‌చ్చాడు.
ఇవ‌న్నీ ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం కేసీఆర్ వేస్తోన్న ఎత్తుగ‌డ‌ల‌ని సోష‌ల్ మీడియా న్యూస్ చెబుతోంది. వ‌రి ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో ఫైట్ చేస్తున్నాడ‌ని సొంత మీడియా అంటోంది. మోడీతో లైజ‌నింగ్ వ్య‌వ‌హారమ‌ని ప్ర‌త్య‌ర్థి మీడియా భావిస్తోంది. మొత్తం మీద ఢిల్లీ చ‌క్రం ఏదో ఒక రూపంలో తిప్ప‌డానికి కేసీఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని అర్థం అవుతోంది.యాదాద్రి, స‌చివాల‌యం నిర్మాణాల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయ‌డానికి హ‌డావుడి చేస్తున్నాడు. ఇవ‌న్నీ పూర్తయిన త‌రువాత కేటీఆర్ కు ప‌ట్టాభిషేకం జ‌రుగుతుంద‌ని ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు. ఆ త‌రువాత కేసీఆర్ ఢిల్లీ రాజ‌కీయాల‌కు ప‌రిమితం అవుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. కానీ, ఇలాంటి ప్ర‌చారం గ‌తంలోనూ జ‌రిగింది. వాస్త‌వ‌రూపం దాల్చుతుంద‌ని అనుకునే క్ర‌మంలో కేసీఆర్ సీన్లోకి వ‌చ్చి..అంతా తూచ్ అంటూ మీడియా ఎదుట కొట్టిపారేసిన సంద‌ర్భాలు అనేకం.ఈసారి కూడా అలాగే జ‌రుగుతుంద‌ని కేసీఆర్ కోట‌రీలోని కొంద‌రు విశ్వ‌సిస్తున్నారు. పైగా సంతోష్ కుమార్ ట్వీట్ చేసిన ఫోటోను చూసిన త‌రువాత కేటీఆర్ కు సీఎం ప‌ద‌వి ఇప్ప‌ట్లో రాద‌ని పార్టీలోని కొంద‌రు భావిస్తున్నారు. ఆ ఫోటోలోని అర్థం అదేనంటూ గుస‌గుస‌లాడుకుంటున్నారు. కేటీఆర్‌కు అంద‌ని ద్రాక్ష‌గానే సీఎం ప‌ద‌వి మిగిలిపోయేలా ..ఆ ఫోటో ఉంద‌ని టాక్ . బతికున్నంత కాలం సీఎంగా కేసీఆర్ సంతోషంగా ఉంటార‌ని మ‌రో వ‌ర్గం చ‌ర్చించు కుంటోంది. మొత్తం మీద ఆ ఫోటో కేటీఆర్ సీఎం ప‌ద‌విపై అంచ‌నాల‌ను నీరుగార్చుతోంద‌న్న‌మాట‌.