CM KCR : కేసీఆర్ కు `ఢిల్లీ`లో జ్వ‌రం ప‌ట్టుకుంది..!

ద‌స‌రా రోజు బీఆర్ఎస్ పార్టీని ప్ర‌క‌టించిన కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అక్క‌డ ఏమి చేస్తున్నారు? సీఎంవో ఆఫీస్ ఎందుకు ఆయ‌న షెడ్యూల్ ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా దాస్తోంది?

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 01:14 PM IST

ద‌స‌రా రోజు బీఆర్ఎస్ పార్టీని ప్ర‌క‌టించిన కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అక్క‌డ ఏమి చేస్తున్నారు? సీఎంవో ఆఫీస్ ఎందుకు ఆయ‌న షెడ్యూల్ ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా దాస్తోంది? ప్ర‌తిసారీ ఢిల్లీ సీక్రెట్ ప‌ర్య‌ట‌న ఏమిటి? ఇలాంటి ప్ర‌శ్న‌లు ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోనే కాదు, స‌గ‌టు తెలంగాణ పౌరుడుకి వ‌చ్చేవి. వాటికి స‌మాధానం చెప్పాల్సిన టీఆర్ఎస్ మాత్రం ఎప్పుడూ మౌనంగానే ఉంటుంది. ఫ‌లితంగా ప‌లు ర‌కాల పుకార్లు షికార్లు చేయ‌డం స‌ర్వ‌సాధారణంగా మారింది.

ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నార‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల అన‌ధికార స‌మాచారం. చికిత్స కూడా తీసుకుంటున్నార‌ట‌. దీంతో హైదరాబాద్ రావాల్సిన షెడ్యూల్ మరింత ఆలస్యమైందని టాక్‌. మరో నాలుగు రోజులు అక్కడే ఉంటార‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల లీకులు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఢిల్లీకి వెళ్లార‌ట‌. పాలనకు సంబంధించి ఢిల్లీలోనే సమీక్ష చేయనున్నార‌ని తెలిసింది.

మునుగోడు ఉప ఎన్నిక గెలుపు కోసం కేసీఆర్ బ‌హిరంగ స‌భ పెడ‌తార‌ని ఇటీవ‌ల వినిపించింది. కానీ, ఆయ‌న ఆ దిశ‌గా అడుగులు వేయ‌డంలేద‌ని అర్థం అవుతోంది. యూపీ మాజీ సీఎం ములాయంసింగ్ యాద‌వ్ అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ ఆయ‌న కుమార్తె అటు నుంచి అటు ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ నిర్మాణం జ‌రుగుతోన్న తెలంగాణ భ‌వ‌న్ వాస్తు సూచ‌న‌లు చేశారు. ఆ మేర‌కు ఫోటోల‌ను కూడా విడుద‌ల చేశారు. ఆ త‌రువాత కేసీఆర్ షెడ్యూల్ ఏమిటో ఎవ‌రికీ తెలియ‌దు. ఆయ‌న‌కు జ్వ‌రం వ‌చ్చింద‌ని ఆల‌స్యంగా తెలుస్తోంది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించిన విచార‌ణ వేగంగా జ‌రుగుతోంది. దాన్లో ఎమ్మెల్సీ క‌విత‌తో పాటు టీఆర్ఎస్ కు చెందిన కీల‌క వ్య‌క్తులు ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో కేంద్రాన్ని ప్ర‌స‌న్నం చేసుకోవడానికి కేసీఆర్ అక్క‌డ ఉన్నార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కానీ, టీఆర్ ఎస్ నుంచి మాత్రం ఎలాంటి వివ‌ర‌ణ రావ‌డంలేదు. అందుకే, సామాన్యులు సైతం ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ విచార‌ణ‌ను ఆపుకునేందుకు లైజ‌నింగ్ చేస్తున్నార‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారాన్ని విశ్వ‌సించ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డింది.