Site icon HashtagU Telugu

Warangal City: వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి!

Warangal City

Warangal City

Warangal City: వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ, వరంగల్ (Warangal City) జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలు ఇచ్చారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధిపై బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా మంత్రులు కొండా సురేఖ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, భ‌ద్ర‌కాళి చెరువు, విమానాశ్ర‌యం, తదితర అంశాలపై ప్ర‌ధానంగా చర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్లను త్వరితగతిన తయారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. వరంగల్ నగరంలో నిర్మించే రింగ్ రోడ్డు జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలని, ఈ ప్రాజెక్టుకు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.\

Also Read: Warning To Manchu Vishnu: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచ‌కొండ సీపీ!

ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న‌, భ‌ద్ర‌కాళి చెరువు శుద్దీక‌ర‌ణ ప‌నుల‌ను వేగ‌వంతంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ప్రాధాన్య‌త క్రమంలో ప‌నుల‌ను చేప‌ట్టి పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిశోర్, ఆర్ధిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డైరెక్ట‌ర్ శ్రీ‌దేవి, మైనింగ్ శాఖ కార్య‌ద‌ర్శి సురేంద్ర మోహ‌న్‌, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారదా, పి.ప్రావీణ్య, త‌దిత‌ర శాఖల అధికారులు పాల్గొన్నారు.