తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను అంతర్జాతీయంగా వివరించి, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, రాష్ట్రంలోని యువతకు భారీ స్థాయిలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ రెండు రోజుల మెగా సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్‌లో 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు, కాగా ఈ రెండు రోజుల్లో ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం.
‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న విడుదల చేయడం. NITI ఆయోగ్ సహకారంతో రూపొందించిన ఈ మార్గదర్శక ప్లాన్, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు పెట్టుబడులు, సాంకేతికత మరియు ఆవిష్కరణల ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డాక్యుమెంట్ తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రంగా మారుస్తుంది.
Telangana Future City : ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు
ఈ సమ్మిట్ యొక్క కార్యాచరణలో 27 ప్రత్యేక ప్యానెల్ సెషన్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సెషన్లలో శక్తి, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం వంటి కీలక రంగాలపై లోతైన చర్చలు జరుగుతాయి. సెమీకండక్టర్ తయారీ, ఫ్రంటియర్ టెక్నాలజీలు, గ్రీన్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, జీరో-ఎమిషన్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా తెలంగాణను గ్లోబల్ టెక్ మరియు ఎకో-ఫ్రెండ్లీ హబ్‌గా మార్చాలని ఆశిస్తున్నారు.
వ్యవసాయ రంగంలోనూ IoT మైక్రో-ఇరిగేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు మరియు ఫార్మర్-ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను ఫుడ్ డెలివరీ కంపెనీలతో అనుసంధానించడంపై చర్చలు జరుగుతాయి. అలాగే, హైదరాబాద్ జెనోమ్ వ్యాలీ ద్వారా వ్యాక్సిన్ తయారీ హబ్‌గా తెలంగాణను స్థాపించడంపై హెల్త్‌కేర్ సెషన్లలో చర్చిస్తారు.
ఈ సమ్మిట్‌కు హాజరవుతున్న అతిథుల జాబితా దాని అంతర్జాతీయ ప్రాముఖ్యతను తెలుపుతోంది. మొత్తం 42 దేశాల నుంచి 1,686 మంది డెలిగేట్లు, వీరిలో 225 మంది అంతర్జాతీయ అతిథులు ఉన్నారు. అమెరికా, యూఏఈ, యూకే వంటి దేశాల నుండి ప్రతినిధులతో పాటు, ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, WHO, UNICEF వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఈ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది, ఈ అత్యాధునిక వేదిక సమ్మిట్‌కు మరింత ఆకర్షణను పెంచుతుంది.
PV సింధు, అనిల్ కుంబ్లే వంటి క్రీడా ప్రముఖులు, మరియు సినీ తారల భాగస్వామ్యం ‘ఫిల్మ్ ఇన్ తెలంగాణ’ ద్వారా క్రియేటివ్ ఎకానమీని ప్రోత్సహిస్తుంది. భద్రత కోసం 4,500 మంది పోలీసులతో మూడు అంచెల సెక్యూరిటీ ఏర్పాటు చేయగా, సమ్మిట్ తర్వాత పబ్లిక్ షోకేస్‌లు, ఇన్నోవేషన్ ఎగ్జిబిట్స్, డ్రోన్ షోల ద్వారా సామాన్య ప్రజలకు కూడా ఈ వేడుకను చూసే అవకాశం కల్పించనున్నారు.
