BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్‌లో తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నాం. ఆ రోజున ఉదయం 10 గంటలకు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడీని విడుదల చేస్తాం. ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో కేసీఆర్ ఆయురారోగ్యాలు కాంక్షిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రార్థనలు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాలను బీఆర్ఎస్ కార్యకర్తలు విజయవంతం చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
Read Also: Abbaya Chowdary : వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు
తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. కేసీఆర్ గతంలోనే బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం చేశారు. బీసీలు అడుక్కు తినేవాళ్లు కాదు.. తామెంతో తమకంత అని బీసీలు నినదిస్తున్నారు. జనానికి అవసరం లేని విషయాలపై నేను స్పందించను. జీహెచ్ఎంసీ స్టాండింగ్ ఎన్నికల్లో పార్టీ వైఖరిని ఈ నెల 17న ఖరారు చేస్తాం. మేయర్‌పై అవిశ్వాసంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయం తీసుకుంది. మా వ్యూహాలు మాకుంటాయని అన్నారు.
ఎన్నికల ఓటర్ లిస్ట్ ప్రకారం చూసినా కులగణన లెక్కలు తప్పు. జనాభా తక్కువుంటే కేంద్ర నిధులు తక్కువగా వస్తాయి. నియోజకవర్గాల డిలిమిటేషన్‌లో జనసంఖ్య తక్కువ ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. శాస్త్రీయంగా సర్వే జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టబద్దత చేస్తే లాభం లేదు. కేంద్రం నిర్ణయం తీసుకోవాలి అని తలసాని పేర్కొన్నారు. కుట్ర పూరితంగా కులగణన చేశారు. కులగణనను మళ్ళీ చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం. గ్రామాల్లో, పట్టణాల్లో సర్వే ఎక్కడా సరైన రీతిలో జరగలేదు. అరవై లక్షల జనాభాను తక్కువ చేసి చూపారని తలసాని అన్నారు.