- ప్రవైట్ ట్రావెల్స్ దోపిడీకి TSRTC చెక్
- ఏపీకి హైదరాబాద్ నలుమూలల నుండి ప్రత్యేక బస్సులు
- జనవరి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు అందుబాటులో
సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. ప్రతి ఏటా పండుగ సమయంలో రైళ్లలో బెర్తులు దొరకక, ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీతో ఇబ్బందులు పడే సామాన్యుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ మరియు శివారు ప్రాంతాల్లో నివసించే వారి సౌకర్యార్థం బీహెచ్‌ఈఎల్ (BHEL) డిపో నుండి నేరుగా ఏపీలోని వివిధ జిల్లాలకు బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికులు ప్రధాన బస్టాండ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి సమీపం నుండే ప్రయాణించే వీలు కలుగుతుంది.
Tsrtc Sankranthi Buses
ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. రామచంద్రాపురం (RC Puram) నుండి బయలుదేరే ఈ బస్సులు మియాపూర్, కేపీహెచ్‌బీ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ ద్వారా విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, అమలాపురం, నర్సాపురం వంటి ప్రధాన పట్టణాలకు చేరుకుంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచేందుకు కూడా డిపో మేనేజర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రయాణికులు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
ప్రస్తుతం ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకుని విమాన ఛార్జీలకు ధీటుగా టికెట్ ధరలను పెంచేస్తున్నాయి. ఒక కుటుంబం మొత్తం ప్రైవేట్ బస్సులో వెళ్లాలంటే వేల రూపాయల భారం పడుతున్న తరుణంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిచే ఆర్టీసీ బస్సులు సామాన్యులకు భరోసానిస్తున్నాయి. ప్రైవేటు వాహనాల్లో అధిక ధరలు చెల్లించి మోసపోవద్దని, ఆర్టీసీ కల్పించిన ఈ ప్రత్యేక రవాణా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రయాణానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబరు 9959226149ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
