South Telangana : తెలంగాణ రాజ‌కీయాల్లో `ద‌క్షిణ` వ్యూహం!

తొలి నుంచి ద‌క్షిణ తెలంగాణ(South Telangana)  వ్యాప్తంగా `ప్ర‌త్యేక వాదం` సెంటిమెంట్ త‌క్కువ‌. .

  • Written By:
  • Publish Date - December 22, 2022 / 02:21 PM IST

తొలి నుంచి ద‌క్షిణ తెలంగాణ(South Telangana)  వ్యాప్తంగా `ప్ర‌త్యేక వాదం` సెంటిమెంట్ త‌క్కువ‌. పైగా ఏపీ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌త్యేకించి ఖ‌మ్మం, న‌ల్గొండ‌, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్ గా సెంటిల‌ర్లు ఉన్నారు. అందుకే, తొలి నుంచి బీజేపీ ద‌క్షిణ తెలంగాణ(South Telangana) వ్యాప్తంగా బ‌ల‌హీనంగా ఉంది. గ‌త ఏడాది జ‌రిగిన హుజూర్ న‌గ‌ర్, నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ మ‌ధ్య ఫైట్ జ‌రిగింది. క‌నీసం డిపాజిట్లు కూడా బీజేపీ(BJP)కి ఆ రెండు ఉప ఎన్నిక‌ల్లో రాలేదు. అంతేకాదు, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ(BJP) నిలబెట్టుకోలేక పోయింది.

కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉండే జిల్లాల్లో

రాష్ట్రం విడిపోయిన త‌రువాత కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉండే జిల్లాల్లో ఖ‌మ్మం మొద‌టిది. ఆ జిల్లా నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ త‌రువాత న‌ల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బాగా వీచింది. దానికి కార‌ణం తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కూట‌మిగా 2019 ఎన్నిక‌ల్లో వెళ్ల‌డంతో సాధ్యం అయింది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ ఉన్న కార‌ణంగా ఆశించిన ఫ‌లితాల‌ను సాధించ‌గ‌లిగింది. హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ అంతే. టోటల్ గా ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ బ‌లం ఉత్త‌ర తెలంగాణ కంటే ఎక్కువ‌. ఆ మేర‌కు ఇటీవ‌ల వ‌చ్చిన స‌ర్వేలు కూడా అదే చెబుతున్నాయి. ఉత్త‌ర తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో మ‌హారాష్ట్ర ప్ర‌భావం ఉంటుంది. ఫ‌లితంగా బీజేపీ బ‌లంగా ఉంది. క‌ర్ణాట‌క ప్ర‌భావం కొంత మేరకు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప్రాంతంలో బీజేపీకి కలిసి రావ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. ఇక మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉంది.

ఉత్త‌ర తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ముక్కోణ‌పు పోటీ ఉండడానికి అవ‌కాశం ఉంది. అదే, ద‌క్షిణ తెలంగాణ, మ‌ధ్య తెలంగాణ ఈక్వేష‌న్ తీసుకుంటే తెలుగుదేశం ఏ పార్టీతో క‌లిసి ఉంటుందో ఆ పార్టీ మెజార్టీ సాధించడానికి అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. పైగా ప్ర‌స్తుతం బీసీ ఈక్వేష‌న్ తో వెళుతోన్న టీడీపీ కి ప్ర‌త్యేక‌మైన ఆకర్ష‌ణ క‌లిగి ఉంది. ద‌క్షిణ తెలంగాణ‌లో బీజేపీకి ఎంట్రీ ఎక్క‌డా దాదాపుగా లేదు. ఇటీవ‌ల న‌ల్గొండ జిల్లా మునుగోడులో ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఇక ఖ‌మ్మం జిల్లాలో లీడ‌ర్ల కొర‌త బీజేపీకి కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ చాలా చోట్ల చెప్పుకోద‌గ్గ లీడ‌ర్లు క‌నిపించ‌రు. కేవ‌లం ఉత్త‌ర తెలంగాణ లీడ‌ర్లు మాత్ర‌మే ఎక్కువ‌గా బీజేపీలో క‌నిపిస్తుంటారు.

ద‌క్షిణ తెలంగాణ మీద(South Telangana)

కాంగ్రెస్ పార్టీ ఆశ‌లు కూడా ద‌క్షిణ తెలంగాణ మీద బాగా ఉన్నాయి. సీనియ‌ర్లు ఎక్కువ‌గా అక్క‌డే ఉన్నారు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్, ఎంపీ కోమ‌టిరెడ్డి, జానారెడ్డి , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త‌దిత‌ర ఉద్ధండులు ద‌క్షిణ తెలంగాణపై ప‌ట్టు గ‌లిగి ఉన్నారు. వాళ్ల‌ను కాద‌నుకుంటే ఇక కాంగ్రెస్ ప‌ని గోవిందా? అంటూ రాజ‌కీయ పండితుల అంచనా. వాళ్ల‌ను దెబ్బ‌కొట్టాలంటే బీజేపీకి అంత ఈజీ కాదు. ఇటీవ‌ల ప్ర‌జా సంగ్రామ యాత్ర‌ను ద‌క్షిణ తెలంగాణ‌లోని కొన్ని చోట్ల చేసిన‌ప్ప‌టికీ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కు వ‌చ్చిన సానుకూల స్పంద‌న నామమాత్ర‌మే. అంటే, కాంగ్రెస్ ఆయువు ద‌క్షిణ తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. స‌రిగ్గా అక్క‌డ కొడితే కాంగ్రెస్ ఖ‌తం అవుతోంది. అదే, ఉత్త‌ర తెలంగాణపై పైచేయి సాధిస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం ఖాయం. మ‌ధ్య తెలంగాణ ప్రాంతంలో మిశ్ర‌మ ఫ‌లితాల‌ను కాంగ్రెస్, బీజేపీ సాధించే అవ‌కాశం ఉంది. మొత్తం మీద ద‌క్షిణ తెలంగాణ దిశ‌గా రాజ‌కీయ గాలి వీస్తుంద‌న్న‌మాట‌.

ప్ర‌స్తుతం ఉత్త‌ర తెలంగాణ వ్యాప్తంగా బ‌లంగా ఉన్న బీజేపీ ద‌క్షిణ‌, మ‌ధ్య తెలంగాణ ప్రాంతాల్లోనూ విస్త‌రించాలంటే అనివార్యంగా టీడీపీ పొత్తు అవ‌స‌రం. ఒక వేళ క‌మ్యూనిస్ట్ లు బీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్లిన‌ప్ప‌టికీ పెద్ద‌గా బీజేపీ నష్టం ఉండ‌కూద‌నుకుంటే చంద్ర‌బాబును క‌లుపుకోవాల్సిందే. లేదంటే, కామ్రేడ్లు, బీఆర్ఎస్ క‌లిసి ద‌క్షిణ తెలంగాణ మీద ప‌ట్టుసాధించే అవ‌కాశం ఉంది. ఒక వేళ బీఆర్ఎస్ ఒంట‌రిగా వెళితే, కాంగ్రెస్ , క‌మ్యూనిస్ట్ లు కూట‌మి ఏర్ప‌డ్డానికి ఛాన్స్ ఉంది. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆవ‌శ్య‌క‌త బీజేపీకి ఉంది. ఇలా ఏ కోణం నుంచి తీసుకున్న‌ప్ప‌టికీ ద‌క్షిణ తెలంగాణ రాజ‌కీయం అధికారాన్ని నిర్దేశించ‌బోతోంది.

Also Read : Telangana BJP Upset: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కండువా కప్పుకునేవారేరి!