Site icon HashtagU Telugu

CM Revanth: దక్షిణ భారత కుంభమేళా.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

CM Revanth

CM Revanth

CM Revanth: 2027లో రానున్న గోదావరి పుష్కరాలను ‘దక్షిణ భారత కుంభమేళా’గా ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులను కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

ప్రధాన ఆలయాలపై ప్రత్యేక దృష్టి

గోదావరి పుష్కరాలు జూలై 23, 2027 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటినుంచి దాదాపు 22 నెలల సమయం ఉన్నందున దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే పనులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రధాన ఆలయాలను మొదట అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

Also Read: Sushila Karki: నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకం

భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలు

పుష్కర స్నానాల కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. రోడ్లు, వాహనాల పార్కింగ్, తాగునీరు, వసతి, స్నానాల ఘాట్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు.

కేంద్ర సహాయం కోసం ప్రణాళిక

పుష్కరాల ఏర్పాట్లలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి వాటిని సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పనుల జాబితాను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీని కోరేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, కుంభమేళా నిర్వహణలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీల సేవలను వినియోగించుకోవాలని కూడా సీఎం సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.