Site icon HashtagU Telugu

Telangana Formation Day 2024 : దశాబ్ధి వేడుకల్లో సోనియా ఎంత సేపు మాట్లాడుతోందంటే.. !!

Soniya Speech

Soniya Speech

తెలంగాణ దశాబ్ధి వేడుకల్లో ముఖ్య అతిధిగా కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ హాజరు కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా..ఇప్పుడు దశాబ్ధి వేడుకల్లో పాల్గొన బోతుండడంతో కాంగ్రెస్ నేతలు ఆ ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొనే సోనియా..కేవలం ఐదు నిముషాలు మాత్రం ప్రసగించున్నారని తెలుస్తుంది. సెలబ్రేషన్ స్టేజ్‌పై నుంచి ఎలాంటి రాజకీయ విమర్శలు లేకుండానే స్పీచ్ ఉండనున్నట్లు తెలిసింది.

తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం, యూపీఏ 1, 2లో పార్టీ తీసుకున్న నిర్ణయాలు వంటివి వివరించనున్నారు. కరీంనగర్‌లో ఇచ్చిన ప్రామిస్‌తో పాటు రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై ఆమె మాట్లాడనున్నట్లు వినికిడి. ఇప్పటికే స్పీచ్ కాపీ రెడీ కాగా, సదరు కాపీ ట్రాన్స్ లేటర్‌కు అందించేందుకు పార్టీ ప్రోటోకాల్ విభాగం ఆలోచిస్తున్నది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతోపాటు పలువురు ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం అందజేసింది. ఈసారి ఉదయం, సాయం త్రం రెండు పూటలా ఘనం గా వేడుకలకు ఏర్పాట్లు చేశారు.

ఉదయం సమయంలో…

జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఆ తరువాత పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్న సోనియాగాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

సాయంత్రం సమయంలో..

ట్యాంక్ బండ్ పై సాయంత్రం 6.30 గంటలకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి. హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. అదేవిధంగా తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు అద్దం పట్టే విధంగా కార్నివాల్ నిర్వహిస్తారు. ఈ కార్నివాల్ లో 700 మంది కళాకారులు పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఒక చివరి నుంచి మరో చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు 13.30 నిమిషాల పాటు సాగే పూర్తి నిడివితో ఉన్న ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపిస్తారు. అనంతరం కవి, గీత రచయిత అందెశ్రీని సన్మానించనున్నారు. ఆ తరువాత 10 నిమిషాల పాటు బాణసంచా కాల్చే కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో వేడుకలు ముగియనున్నాయి.

Read Also : 100 Ton Gold: లండన్ నుంచి 100 టన్నుల బంగారాన్ని రీకాల్ చేసిన ఆర్బీఐ.. కార‌ణ‌మిదేనా..?