Site icon HashtagU Telugu

Sonia Gandhi : తెలంగాణ ఎన్నికల బరిలో సోనియా ? ఆ మూడు స్థానాలపై గురి !

Congress Rajya Sabha Candidates

Sonia Sonia Gandhi Key Meet

Sonia Gandhi : ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ? అనే దానిపై కొంత సమాచారం బయటికి వచ్చింది. ఆమె తెలంగాణ నుంచి పోటీ చేయడమైతే దాదాపు ఖాయమని అంటున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌‌లలో ఏదో ఒక లోక్‌సభ స్థానం నుంచి సోనియా బరిలోకి దిగుతారని అంచనా వేస్తున్నారు. ఈ మూడు ఎంపీ స్థానాల్లోనూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్రస్తుతం ఈ మూడు పార్లమెంట్​ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ స్థానాల నుంచి తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, మాజీ పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఖమ్మం నుంచి సోనియాగాంధీ  పోటీ చేేసే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కార్యాచరణ కూడా రెడీ అవుతోందనే టాక్ వినిపిస్తోంది. సోనియా తెలంగాణలో పోటీ చేస్తే ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయని హస్తం పార్టీ వర్గాలు లెక్కలు  వేసుకుంటున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఒకవేళ సోనియా(Sonia Gandhi) ఖమ్మం నుంచి బరిలోకి దిగితే.. ఆమె గెలుపు బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ షర్మిలకు అప్పగిస్తారని తెలిసింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 10కి 9 స్థానాలు వచ్చాయి. దానికి తోడు పొంగులేటి గతంలో ఖమ్మం ఎంపీగానూ పని చేశారు. ఆయనకు జిల్లా వ్యాప్తంగా బలమైన నేతగా గుర్తింపు ఉంది. వైఎస్ షర్మిలకూ ఖమ్మం జిల్లాపై పట్టుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఈ జిల్లాలో పెద్దసంఖ్యలో ఉన్నారు. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరుతూ టీపీసీసీ డిసెంబర్‌ నెలలోనే తీర్మానం చేసింది. ఇటీవల రెండోసారి కూడా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి సోనియాగాంధీ ఈసారి పోటీ చేస్తే దక్షిణాది నుంచి ఆమె బరిలోకి దిగడం ఇది రెండోసారి అవుతుంది. గతంలో 1999లో కర్ణాటకలోని బళ్లారి నుంచి ఆమె పోటీ చేసి గెలిచారు.ఆ ఎన్నికల్లో బీజేపీ నేత సుష్మా స్వరాజ్‌ను సోనియా ఓడించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి పోటీ చేశారు. 1978లో కర్ణాటకలోని చిక్‌మగళూరు నుంచి ఇందిరా గాంధీ పోటీ చేసి విజయం సాధించారు. 1980లో మెదక్‌ నుంచి పోటీ చేసి గెలిచారు.