CM KCR: గులాబీ బాస్ చేతిలో ‘నేతల జాతకాలు’

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ పావులు కదుపుతున్నారు.

  • Written By:
  • Updated On - March 31, 2022 / 03:52 PM IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ పావులు కదుపుతున్నారా..? టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ, ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా..? అసంత్రుప్త ఎమ్మెల్యేల పై కేసీఆర్ సీరియస్ గా ఉన్నారా..? అంటే అవుననే అంటున్నాయి పలు పొలిటికల్ సర్వేలు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందంతో సహా మూడు వేర్వేరు ఏజెన్సీల బహుళ సర్వేలు తుది రిపోర్ట్ ఇవ్వనున్నాయి. మొత్తం 103 మంది సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు సర్వేలు జరుగుతున్నాయని, మిగిలిన ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌, మూడు స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐఎంఐఎంకు ఉన్న ఏడు స్థానాలు మినహా మొత్తం 112 అసెంబ్లీ నియోజకవర్గాల తుది సర్వే నివేదికలను ఏప్రిల్ 15లోగా చంద్రశేఖర్‌రావుకు అందజేస్తామని పలు సర్వేల ప్రతినిధులు తెలిపారు.

సర్వేల్లో పేలవ రికార్డ్ ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని, వారి పనితీరును మెరుగుపరచుకోవడానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని, తిరిగి సర్వే నిర్వహించబడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ టిక్కెట్లు దక్కించుకోవడంలో ఎమ్మెల్యేల భవితవ్యం ఈ సర్వే పై ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు 30 నియోజకవర్గాల నుంచి సర్వే నివేదికలు అందాయని, మిగిలిన నివేదికలు ఏప్రిల్ 15 నాటికి అందుతాయని సమాచారం. ఈ 30 సర్వే నివేదికలు టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఓటర్లు సంతోషంగా ఉన్నారనీ, అయితే అందుకు అనుకూలంగా లేరనీ సూచించింది. కొంతమంది సిట్టింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల స్థానంలో  కొత్త ముఖాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు , ఎమ్మెల్యేలు పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికైన నియోజకవర్గాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలలో 90 మంది ఎమ్మెల్యేలు ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచారు. వీరిలో 80 మంది టీఆర్‌ఎస్‌కు చెందినవారు. 119 మంది ఎమ్మెల్యేలలో 44 మంది ఎమ్మెల్యేలు రెండు దఫాలు, 22 మంది ఎమ్మెల్యేలు మూడు దఫాలు, 14 మంది ఎమ్మెల్సీలు నాలుగుసార్లు, 5 మంది ఎమ్మెల్యేలు ఐదుసార్లు, 4 మంది ఎమ్మెల్యేలు ఆరుసార్లు గెలిచారు. అనేకసార్లు గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు టీఆర్‌ఎస్‌కు చెందినవారే. టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఓటర్లు సాఫ్ట్‌ కార్నర్‌ను కలిగి ఉన్నప్పటికీ పలుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలపై ఒకింత వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేలిందట.