Hyderabad : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నగరంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..సమాజం వ్యసనాల వైపు వేగంగా వెళ్తుందన్నారు. ఇక..విద్యార్థులు గంజాయి , డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలని సీఎం పిలుపు నిచ్చారు. గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి పిల్లలను కలిశారా అని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతేకాక..సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కులగణన సర్వే కొనసాగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు.
కాగా, కులగణన తో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు కావాలంటే కులగణన జరగాలని అన్నారు. కులగణన ఆధారంగా అమలు అవుతోన్న సంక్షేమ పథకాలను తొలగిస్తారని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని సీఎం అన్నారు. అయితే ఇది ఎక్స్‌రే కాదు.. మెగా హెల్త్ చెకప్ లాంటిదని అన్నారు. కొందరు గతంలో విద్యార్థుల శవాల మీద పదవులు పొందారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.