Smart Ration Cards: తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులను పొందే వారితో పాటు పాత వాళ్లకూ స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు వేగవంతం చేసింది. దాదాపు 1.20 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించి పంపిణీ చేసేందుకు సరైన సంస్థను ఎంపిక చేయడంపై ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. ఆసక్తి ఉన్న సంస్థలు మార్చి 25లోగా టెండర్లు దాఖలు చేయొచ్చు. ఈనెల 26న సాయంత్రంలోగా అర్హతలు ఉన్న సంస్థకు స్మార్ట్ రేషన్ కార్డుల ప్రింటింగ్ బాధ్యతను అప్పగిస్తారు. కార్డుల సరఫరా పూర్తయ్యే వరకు లేదా రెండేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును పౌరసరఫరాల శాఖ చెల్లిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 89,95,282 రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చడం కోసం దాదాపుగా 18 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి.
Also Read :HMDA Expansion :హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు.. ‘ఫ్యూచర్ సిటీ’లోకి 56 గ్రామాలు
స్మార్ట్ రేషన్ కార్డు ఎలా ఉంటుంది ?
- స్మార్ట్ రేషన్ కార్డు(Smart Ration Cards)పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. రేషన్ షాపుకు వెళ్లి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే, రేషన్ కార్డులో ఉన్న పేర్ల వివరాలన్నీ కనిపిస్తాయి. ఎంత బియ్యం ఇవ్వాలో కనిపిస్తుంది.
- ఈ కార్డుపై కుటుంబ పెద్ద ఫొటో మాత్రమే ఉంటుంది.
- ఇది ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది.
- 760 మైక్రాన్స్ మందం, 85.4 మి.మీ పొడవు, 54 మి.మీ వెడల్పుతో పీవీసీ కార్డును ఇస్తారు.
- కార్డు ముందు భాగంలో తెలంగాణ ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, హాలోగ్రామ్, రేషన్ షాపు నంబర్ ఉంటాయి.
- కార్డు వెనుక వైపున జిల్లా పేరు, మండలం, గ్రామం, క్యూ ఆర్ కోడ్, రేషన్ కార్డుదారుడి చిరునామా ఉంటాయి.
- క్యూఆర్ కోడ్‌తో ఇచ్చే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. మార్పులు చేసిన వెంటనే, కొత్త క్యూఆర్ కోడ్‌ను జనరేట్ చేసుకోవచ్చు.
- ఇప్పటికే కేరళ, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నతాధికారుల బృందం గత సంవత్సరమే అధ్యయనం చేసింది.